Mobile Popup Ad
Mobile Popup Ad

డిప్యూటీ కలెక్టర్ @ కరప్షన్ కింగ్.. వామ్మో అక్రమాస్తులు ఇన్ని కోట్లా?

కలం, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ ) మరోసారి పంజా విసిరింది. ఆదాయానికి మించి అస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో మేడ్చల్ – మల్కాజ్‎గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ (Medchal Deputy Collector Vamsi Mohan) నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం నుంచే వంశీమోహన్ నివాసంతో పాటు బంధువులు, బినామిలకు చెందిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‎తో పాటు వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి.

సోదాల్లో భాగంగా ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. రూ. 4.46 కోట్ల విలువైన 19 ఖాళీ స్థలాలు, వనస్థలిపురంలోని ఎన్జీవో కాలనీలో ఒక ఇండిపెండెంట్ ఇల్లు, రూ. 1.12 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లు మణికొండలో ఒక ఫ్లాట్ (1000 చదరపు అడుగులు) , మజీద్ బండలో (2000 చదరపు అడుగులు ) ఫ్లాట్, అలాగే ఇబ్రహీంపట్నం నారెపల్లిలో 2 ఎకరాల వ్యవసాయ భూమిలో రూ. 10 లక్షల విలువైన ఫామ్ హౌస్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

రూ. 2.10 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బ్యాంకు ఖాతాల్లో రూ. 20 లక్షల నగదు, సుమారు 122 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ. 32 లక్షలు విలువైన రెండు కార్లను అధికారులు సోదాల్లో భాగంగా గుర్తించారు. మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 6.22 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం ఈ మొత్తం ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని తెలుస్తుంది.

గతంలో శేరిలింగంపల్లి ఆర్డీవోగా పనిచేసిన సమయంలోనే వంశీ మోహన్ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు మళ్లించడం, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయించడం, బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్లు జరిపించడం వంటి ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో అబ్దుల్లాపూర్‌మెట్, పిగ్లీపురం ప్రాంతాల్లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన అక్రమంగా కాజేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఈ భూములను ముందుగా తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి, ఆ తర్వాత ఒక రియల్టర్‌కు ధారాదత్తం చేసినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. దీనికి ప్రతిఫలంగా సదరు రియల్టర్ నుంచి వంశీ మోహన్ కుటుంబ సభ్యుల పేరిట 10 విలువైన ప్లాట్లను ‘గిఫ్ట్ డీడ్’ రూపంలో పొందినట్లు ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించింది. కీలక ల్యాండ్ డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>