కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెలుగుచూసిన అక్రమాల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ ఎస్‌ఆర్‌వోగా విధులు నిర్వహిస్తున్న మండ కిరణ్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా, అనంతరం ఇన్‌చార్జ్ ఎస్‌ఆర్‌వోగా పనిచేసిన సమయంలో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 2025 నవంబర్ 14న ఏసీబీ అధికారులు కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో ఆధారాలు లభ్యం
తనిఖీల సమయంలో రూ.1,06,500 నగదుకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలు, అక్రమ వసూళ్లకు సంబంధించిన పలు ఆధారాలు లభించినట్లు తెలిసింది. అనంతరం కేసును లోతుగా దర్యాప్తు చేసిన అధికారులు, నిజామాబాద్‌లోని నివాసంలో మండ కిరణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో రిజిస్ట్రేషన్ శాఖలో కొనసాగుతున్న అవినీతి వ్యవహారాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజల నుంచి అధిక మొత్తాల్లో డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశముంది.

