కలం వెబ్ డెస్క్ : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ (Betting Apps) మరో యువకుడిని బలి తీసుకున్నాయి. బెట్టింగ్‌కు బానిసై లక్షల్లో అప్పు చేసిన యువకుడు, అప్పు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓం శాంతి కాలనీకి చెందిన వల్లందేసి శ్రీకర్(30) ఏడాదిన్నర కాలం నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వినియోగిస్తున్నాడు. లక్షల్లో అప్పులు చేస్తూ బెట్టింగ్స్ చేశాడు. ఆన్‌లైన్ యాప్స్, స్నేహితులు, కుటుంబసభ్యుల నుంచి మొత్తంగా రూ.20 లక్షల వరకు అప్పుగా తీసుకున్నాడు.
కొద్ది రోజుల నుంచి అప్పులు ఇచ్చిన వాళ్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక శ్రీకర్ తనలో తాను మానసిక వేదన అనుభవించాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపే శ్రీకర్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శ్రీకర్ మృతితో ఓం శాంతి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువత బెట్టింగ్ యాప్స్‌కు (Betting Apps) దూరంగా ఉండాలని, అనవసరంగా అప్పులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read Also: ‘మళ్లీ బంతిని పట్టుకోలేనన్నారు’
Follow Us On: Instagram


