కలం డెస్క్ : బీఆర్ఎస్ పదేండ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ విధానాలపై నోరెత్తని ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత(Kavitha) ఆనాటి తప్పులను ఇప్పుడు తెరమీదకు తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలోకి దూకి త్యాగం చేసిన కుటుంబాలకు కేసీఆర్ పాలనలో న్యాయం జరగలేదని ఇటీవల వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఇప్పుడు గొత్తి కోయ తెగకు చెందిన ఆదివాసీల విషయంలోనూ అలాంటి భిన్నవైఖరినే తీసుకున్నారు. వారిని రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించే ప్రసక్తే లేదని కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్తే కవిత మాత్రం గొత్తికోయలు నివసించే గూడాల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేవని, అవి అందే వరకు వారి తరఫున కొట్లాడతానని హామీ ఇచ్చారు. తండ్రి విధానాలను కవిత తప్పుపడుతున్నారు.
నిర్వాసిత గొత్తి కోయలకు అండగా ఉంటా :
కొత్తగూడెం జిల్లా కోయగూడెంలో సింగరేణి సంస్థ చేపట్టిన ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరుతో నిర్వాసితులైన గొత్తికోయలతో కవిత ముచ్చటించారు. రోడ్డు సౌకర్యం లేదని, విద్యుత్ సరఫరా లేదని, తాగునీటి నల్లాలు కూడా లేవని, పిల్లల చదువు కోసం ప్రభుత్వ పాఠశాలలూ లేవన్నారు. దీనికంతటికీ కారణం సింగరేణి సంస్థ యాజమాన్యమేనని, నిర్వాసితుల పక్షాన పోరాడతానని అన్నారు. గొత్తి కోయలు పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారే తప్ప తెలంగాణకు చెందినవారు కాదని అప్పట్లో కేసీఆర్ స్పష్టం చేశారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించలేమని, పోడు భూముల పట్టాలు ఇవ్వలేమని, విద్య-ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కూడా కల్పించలేమన్నారు. కానీ కవిత(Kavitha) మాత్రం వారి సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు, కనీస సౌకర్యాలు లభించేంత వరకు వారి పక్షాన కొట్లాడతానని అన్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Read Also: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీంలో విచారణకు రాలే..!
Follow Us On: Instagram


