Mobile Popup Ad
Mobile Popup Ad

పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలి : ఏఐటీయూసీ

కలం, కరీంనగర్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలు పెంపుదల సహేతుకంగా లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను నామమాత్రంగా పెంచి కోటి 11 లక్షల మంది కార్మికులకు మేలు చేసేదిగా ఉందని గొప్పగా ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వివిధ రంగాల కార్మికులకు 2012లో కనీస వేతనాలు నిర్ణయించారని, గత టిఆర్ఎస్ ప్రభుత్వం వేతనాల పెంపుదల గురించి కార్మికుల డిమాండ్ ఏనాడు పట్టించుకోలేదని అన్నారు.

ఫలితంగా వివిధ దశలలో వివిధ రంగాల కార్మికులు వేతనాలు గురించి చేస్తున్న ఆందోళన పోరాటాల సందర్భంగా నాటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలుపుతూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కనీస వేతనాలను సవరిస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. కనీస వేతనాలను 14 సంవత్సరాల తర్వాత పునః పరిశీలించడానికి ప్రభుత్వం పూనుకోవటం హర్షించదగిన పరిణామం అని పేర్కొన్నారు. కానీ, కనీస వేతనాలపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటన యావత్తు కార్మిక వర్గాన్ని విస్మయానికి గురిచేసింది అని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు జోన్లలో అన్ స్కిల్డ్, సెమిస్కిల్డ్, స్కిల్డ్ ,హైలీ స్కిల్డ్ నాలుగు క్యాటగిరిలో పెంచిన వేతనం ఏమాత్రం శాస్త్రీయంగాను, సమంజసంగా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లేదన్నారు.

గడిచిన 14 సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, డాలర్ తో రూపాయి మారకపు విలువ తగ్గుదల వీటిని పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం కనీస వేతనాలు నిర్ణయించి ప్రకటించేటప్పుడు అన్ని పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ఏవిధంగా చూసినా ఆన్ స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ. 26 వేల రూపాయలకు తక్కువ కాకుండా, ఆపై క్యాటగిరీలకు తదనుగుణంగా వేతనాలను పెంచి ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేకపోతే వేతనాలు పెంపుదలకు అన్ని రంగాల్లోని కార్మికులు ఉద్యమించక తప్పదని టేకుమల్ల సమ్మయ్య హెచ్చరించారు.

Read Also: ‘మెగా పాడ్‌కాస్ట్’.. చిరంజీవి సందడి షురూ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>