కలం, వెబ్డెస్క్: దంపతులు పరస్పర సమ్మతితో విడాకులు కోరితే.. పిటిషన్ దాఖలు చేయడానికి ఏడాది పాటు వేరు (One year separation) గా జీవించాలనే నిబంధన తప్పనిసరి కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అవసరమైన సందర్భాల్లో ఫ్యామిలీ కోర్టులు, హైకోర్టులు ఈ నిబంధన మినహాయించవచ్చని తెలిపింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బి(1)లో ఉన్న ఏడాది నిబంధనను డైరెక్టరీ(మార్గదర్శకమైనది)గానే పరిగణించాలని, తప్పనిసరి(మ్యాండేటరీ) కాదని పేర్కొంది. ఈ మేరకు బుధవారం జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ అనూప్ జైరాం భంభానీ, జస్టిస్ రేణు భట్నాగర్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బి(1) ప్రకారం దంపతులు విడాకులు పొందాలంటే, పిటిషన్ దాఖలు చేయడానికి ముందు కనీసం ఏడాది పాటు విడిగా జీవించాలి. అయితే, ప్రస్తుత తీర్పు ఈ నిబంధన కచ్చితం కాదని స్పష్టం చేసింది.
ఇంకా ధర్మాసనం ఏమందంటే.. పరస్పర సమ్మతి లేని లేదా దంపతుల మధ్య అసాధారణ పరిస్థితులు లేదా కష్టాలు ఉన్న సందర్భాల్లో చట్టబద్దంగా వేచి ఉండే కాలాన్ని సెక్షన్ 14(1) ప్రకారం మినహాయించే అధికారం ఉంది. ఇదే సెక్షన్ను పరస్పర సమ్మతితో విడాకులు కోరే సందర్భాల్లో వర్తింపచేయకుండా ఉండడానికి ఎలాంటి చట్టబద్ధమైన ఆధారం లేదని కోర్టు పేర్కొంది. ఇష్టంలేని భార్యాభర్తలను 13బి(1)లోని ఏడాది నిబంధన (One year separation) ప్రకారం చట్టపరంగా బంధించి ఉండడం రాజ్యాంగలోని ఆర్టికల్ 21 ప్రకారం ఉన్న వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవంపై అనవసర జోక్యంగా మారవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, ఈ తీర్పు విడాకుల కేసుల్లో కీలకంగా మారనుంది.
Read Also: ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకంపై నిషేధం
Follow Us On: Youtube


