కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ కు నిధుల వరద రానుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం కింద కరీంనగర్ కార్పొరేషన్ అభివ్రుద్ధి కోసం రూ.840 కోట్ల విలువైన పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకే కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి హీరాలాల్ మిశ్రా నుండి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ నిధులతో కరీంనగర్ లో స్కై వాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, మోడల్ రోడ్లను నిర్మించనున్నారు. డ్రైయిన్లను పునరుద్దరించనున్నారు. వరద నీటి నివారణ చర్యలకు సంబంధించిన కార్యక్రమాలను అమలు చేయనున్నారు. మొత్తంగా ఈ నిధులు సద్వినియోగమైతే కరీంనగర్ రూపురేఖలే మారబోతున్నాయి. హైదరాబాద్ తరువాత అధునాతన సౌకర్యాలు కరీంనగర్లో అందుబాటులోకి రానున్నాయి.
ఇక పనుల వారీగా పరిశీలిస్తే.. పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, స్కైవాక్‌లు, నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.630 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించగా ఆ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అట్లాగే డ్రెయిన్ల పునరుద్దరణ, వరద నివారణ చర్యల కోసం రూ.130 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించగా ఆమోదం లభించింది. అట్లాగే కరీంనగర్లో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ (Integrated Solid Waste Management) రూ.80 కోట్లకు ఆమోదం తెలిపింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Housing and Urban Affairs) కు చెందిన అపెక్స్ కమిటీ ఈనెల 11న ఢిల్లీలో సమావేశమై ఈ ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతోపాటు కమిటీ ఆదేశాల మేరకు గత శనివారం నాడు కేంద్ర అధికారుల బ్రుందం కరీంనగర్ లో పర్యటించి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఆయా ప్రతిపాదనలకు తుది ఆమోదం తెలపడం గమనార్హం.
పట్టుపట్టి యూసీఎఫ్ నిధులు సాధించిన బండి
తొలుత రాష్ట్ర ప్రభుత్వం పంపిన యూసీఎఫ్ ప్రతిపాదనల జాబితాలో కరీంనగర్ లేదు. వరంగల్ కార్పొరేషన్ ప్రతిపాదనలను మాత్రమే యూసీఎఫ్ స్కీంలో చేర్చారు. ఖమ్మం- వరంగల్- కరీంనగర్ (Warangal – Karimnagar) కారిడార్ ను కూడా ఈ స్కీంలో చేర్చారు. అందులో భాగంగా ఆయా ప్రతిపాదనలకు సంబంధించి డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను కూడా కేంద్రానికి పంపారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను సైతం యూసీఎఫ్ జాబితాలో చేర్చాల్సిందేనని పట్టుపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న వెంటనే కరీంనగర్ అభివ్రుద్ధి, ఆధునీకరణ లో భాగంగా చేపట్టాల్సిన అభివ్రుద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆగమేఘాల మీద ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ లను కలిసి ఈ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. పలుమార్లు కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ ఉన్నతాధికారులతోనూ చర్చించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ ప్రతిపాదనలను ఆమోదించాలంటూ పట్టుపట్టారు. బండి సంజయ్ పట్టుదల నేపథ్యంలో కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ నుండి వచ్చిన 3 ప్రతిపాదనలకు యూసీఎఫ్ నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (Karimnagar Corporation) కు రూ.840 కోట్ల నిధుల మంజూరు కావడంపట్ల కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ లకు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ కు ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడం వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ క్రుషి మర్చిపోలేనిదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తడి తేవడంతోపాటు కేంద్రాన్ని ఒప్పించి యూసీఎఫ్ జాబితాలో కరీంనగర్ ను చేర్చించి ఆయా ప్రతిపాదనలకు ఆమోదింప జేయడంలో బండి సంజయ్ ఎనలేని క్రుషి చేశారని పేర్కొన్నారు.
Read Also : తెలంగాణలో SIR షెడ్యూల్ విడుదల.. ఓటర్లకు బిగ్ అలర్ట్!
Follow Us On: Instagram

