కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ పేర్కొన్నారు. ఎన్జీవో సంస్థల ప్రతినిధులతో శుక్రవారం ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నందిపేట ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలు, మానవ-వన్యప్రాణి ఘర్షణలను తగ్గించే చర్యలపై చర్చించారు. జిల్లాలోని ప్రకృతి సంపద, అటవీ ప్రాంతాలు, జలవనరులు, ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఎకో టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయడానికి ఉన్న విస్తృత అవకాశాలను సమావేశంలో ప్రస్తావించారు.
జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా నిజామాబాద్
సమగ్ర అభివృద్ధి ద్వారా నిజామాబాద్ (Nizamabad) జిల్లాను జాతీయ స్థాయి పర్యాటక పటంలో ప్రముఖ స్థానంలో నిలపవచ్చని డీఎఫ్‌వో తెలిపారు. ఎకో టూరిజం (Ecotourism) అభివృద్ధి ద్వారా స్థానిక గ్రామీణ యువత, మహిళా సంఘాలు, అటవీ పరిసర గ్రామాల ప్రజలకు ప్రకృతి మార్గదర్శకులు, హాస్పిటాలిటీ సేవలు, స్థానిక హస్తకళలు, సంప్రదాయ ఆహార ఉత్పత్తులు, రవాణా సేవలు కమ్యూనిటీ ఆధారిత పర్యాటక కార్యక్రమాల ద్వారా ఉపాధి జీవనోపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.
అటవీ సంరక్షణకు భంగం కలగొద్దు
అటవీ వన్యప్రాణి సంరక్షణకు భంగం కలగకుండా బాధ్యతాయుతమైన సుస్థిర పర్యాటక విధానాలను అమలు చేయడం, ప్రజల్లో అవగాహన పెంపు, వన్యప్రాణి-మానవ ఘర్షణ నివారణకు వినూత్న చర్యలు చేపట్టడం, స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. NEWS, Kakatiya Sandbox సంస్థల ప్రతినిధులు పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, అవగాహన కార్యక్రమాలు స్థానిక జీవనోపాధి అభివృద్ధి కార్యక్రమాలపై తమ సూచనలు తెలియజేసి అటవీ శాఖతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. సమన్వయంతో కూడిన చర్యల ద్వారా నిజామాబాద్ జిల్లాను ఎకో టూరిజం, జీవ వైవిధ్య సంరక్షణ కమ్యూనిటీ ఆధారిత సుస్థిర అభివృద్ధిలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ కట్టుబడి ఉందని డీఎఫ్‌వో పేర్కొన్నారు.
Read Also: విజయ్‌లా నేనూ అధికారంలోకి వస్తా : కవిత
Follow Us On: Instagram

