Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్‌లా నేనూ అధికారంలోకి వస్తా : కవిత

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో విజయ్‌లాగా తెలంగాణ రాష్ట్రంలో తానూ అధికారంలోకి వస్తానని కవిత (Kavitha)  పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో గుణాత్మక మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయకుట్రలో భాగమని వ్యాఖ్యానించారు. తనపై, తన రాజకీయ భవిష్యత్తుపై దాడి చేసేందుకు ఈ కేసును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలను బలహీనపరచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు.

పాలకుడిగా కేసీఆర్ ఫెయిల్

తాను అనేక కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నానని, ఆ అనుభవాలే తనను రాజకీయంగా మరింత బలంగా మార్చాయని కవిత తెలిపారు. కేసీఆర్‌ను (KCR) ప్రశంసిస్తూ తెలంగాణ సాధనలో ఆయన పోరాటాన్ని గుర్తు చేశారు. అయితే ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్‌కు, పాలకుడిగా ఉన్న కేసీఆర్‌కు మధ్య తేడా ఉందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఉచిత విద్య, వైద్యం నా లక్ష్యం

తన పార్టీ ద్వారా విద్య, వైద్యం ఉచితంగా అందించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, సోషల్ జస్టిస్ అమలు, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు కవిత (Kavitha) తెలిపారు.

పేద, మధ్యతరగతి ప్రజలు బాగుండాలి

దేశంలో పెద్ద శాతం ప్రజలు తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారని, అలాంటి పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. అవసరమైన వర్గాలకు పెన్షన్లు, సంరక్షణ సేవలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలపై విమర్శలు చేస్తూ, ప్రధాన పార్టీలు ప్రజల సమస్యలపై కాకుండా పరస్పర రాజకీయ ఒప్పందాలు, విమర్శలకే పరిమితమవుతున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీటి ప్రాజెక్టుల నిర్వహణలో విఫలమైందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వంటి పథకాలు సంవత్సరాలుగా పూర్తికాలేదని విమర్శించారు. ఖర్చులు భారీగా పెరిగినా రైతులకు ప్రయోజనం తక్కువగా ఉందని అన్నారు.

నీటి వనరులను వినియోగించుకోలేకపోయారు

సాగునీటి రంగంలో లక్షల కోట్ల వ్యయం జరిగినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని, చిన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించలేకపోయారని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజువారీగా మహిళలపై నేరాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసుల విషయంలో బాధితులను కించపరచే విధంగా ప్రచారం చేయడం సరికాదని కవిత అన్నారు.

మేం అధికారంలోకి వస్తాం

రాజకీయంగా రేవంత్ రెడ్డి, బీజేపీకి మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూనే కలిసి పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. తాను రాజకీయాల్లో అవకాశాల కోసం రాలేదని, ప్రజల మన్ననలతోనే అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని తెలిపారు. 2028 లేదా 2029 ఎన్నికల నాటికి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చివరగా, తాను అబద్ధాలు చెప్పనని, నిజం మాత్రమే మాట్లాడతానని కవిత పేర్కొన్నారు. జీవిత అనుభవాలే తన ఆలోచనలను మార్చాయని, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడమే తన తుది లక్ష్యమని కవిత స్పష్టం చేశారు.

 Read Also: మహిళలే బెటర్.. ఫిమేల్ పోలీస్ ఆఫీసర్ల పర్ఫామెన్స్‌పై డీజీపీ ప్రశంసలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>