ఎంపీ మిథున్ రెడ్డి(Mithun Reddy).. విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ లిక్కర్ స్కాం నిందితుల రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో మిథున్ రెడ్డి పిటిషన్ కీలకంగా ఉంది. అయితే తన పాస్‌పోర్ట్‌ను విడుదల చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. న్యూయార్క్‌లో జరిగే యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు పీఎంఓ నుంచి పలువురు ఎంపీల బృందం హాజరుకానుంది. ఆ ఎంపీల బృందంలో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. లిక్కర్ స్కాం నిందితుల రిమాండ్ విచారణ సమయంలో ఈ అంశాన్ని నిందితుల తరపు న్యాయవాది.. కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాగా, పాస్ పోర్ట్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం బదులిచ్చింది. దీంతో మిథున్ రెడ్డి తన పాస్ పోర్ట్ విడుదలను కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లు ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించనుంది.
అయితే ఏపీ లిక్కర్ స్కామ్(AP Liquor Scam) కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి.. 71 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. సెప్టెంబర్ 29న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. రూ.2లక్షల షూరిటీతో పాటు వారంలో రెండు సార్లు స్థానిక పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలని ఏసీబీ కోర్టు షరతులు విధించింది. కాగా, అతని బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు తన పాస్‌పోర్ట్‌ను విడుదల చేయాలని కోరుతూ మిథున్ రెడ్డి(Mithun Reddy) కూడా పిటిషన్ దాఖలు చేశారు.

