కలం డెస్క్ : యూపీఏ (UPA-I) ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టిన ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (MGNREGS)లో మహాత్మాగాంధీ పేరు గాయబ్ అయింది. ఇక నుంచి ‘వికసిత్ భారత్ (Vikasit Bharat) గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్’ (VB – G RAM G)గా మారనున్నది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత 2006 నుంచి దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఉపాధి హామీ పథకంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ‘రామ్’ (RAM) పదాన్ని చేర్చింది. ‘వీబీ-జీ రామ్ జీ’ అనే పేరుతో పిలిచేలా కేంద్ర గ్రామీణాభివృద్ధి (Rural Development Ministry) మంత్రిత్వశాఖ బిల్లును రూపొందించింది. దీన్ని పార్లమెంటు (Parliament) ఉభయ సభల్లో చర్చించిన తర్వాత ఆమోదం పొందేలా రాష్ట్రపతి భవన్‌కు పంపింది. దీన్ని పరిశీలించిన రాష్ట్రపతి (Rashtrapati) ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ మేరకు లోక్‌సభకు రాతపూర్వకంగా తెలియజేశారు.
తొలుత లీకులు.. తర్వాత క్లారిటీ :
గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరును మార్చడం ద్వారా యూపీఏ క్రెడిట్ లేకుండా చేయడమేనని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పలువురు వ్యాఖ్యానించారు. తొలి ప్రధాని నెహ్రూను టార్గెట్ చేస్తూ గతాన్ని తవ్వడం ద్వారా ఆయన కృషిని కనుమరుగు చేయాలనుకుంటున్న బీజేపీ ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కూడా మారుస్తున్నదనే ఆరోపణలు చేశారు. పూజ్య బాపూజీ (Pujya Bapuji) పేరు పెట్టి పాత స్కీమ్ పేరును మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు శనివారం లీకులు ఇచ్చాయి. గ్రామీణ ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నట్లు కూడా నోటిమాటగా పేర్కొన్నారు. కానీ పార్లమెంటులోకి ఆ వివరాలేవీ రాకముందే రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన సమాచారాన్ని కేంద్ర మంత్రి బహిర్గతం చేయడం ఎంపీలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
స్కీమ్ పేరులో ‘రామ్’ పదంతో సెంటిమెంట్ :
గ్రామీణ ఉపాది హామీ పథకం పేరును మార్చి ఇప్పుడు దాంట్లో ‘రామ్’ అనే పదం చేర్చడం పార్లమెంటు సభ్యుల మధ్య సరికొత్త చర్చకు దారితీసింది. ‘రామ్’ పదం మాత్రమే కాకుండా దానికి ముందు, వెనక ‘జీ’ అనే సంబోధనను తగిలించడం గమనార్హం. ఇప్పటికే బీజేపీ హిందుత్వ పార్టీ అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో స్కీమ్ పేరులో ‘రామ్’ పదాన్ని చేర్చడం గమనార్హం. మెజారిటీ హిందు ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకోవాలన్న తాపత్రయం బీజేపీలో కనిపిస్తున్నదనే మాటలూ లోక్‌సభ (Lok Sabha) ఆవరణలో వినిపిస్తున్నాయి. లోక్‌సభ వెబ్‌సైట్‌లో ఆదివారం కనిపించిన బులెటిన్ (Bulletin) ప్రకారం పేరు మార్పునకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి ప్రవేశపెడతారని పలువురు ఎంపీలు భావించారు. కానీ సోమవారం షెడ్యూలులో అది చోటుచేసుకోలేదు. ఈ సెషన్‌లోనే పేరు మారుస్తూ బిల్లును కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టే అవకాశమున్నది.
Read Also: బెంగాల్‌లో ‘సర్’ చిచ్చు.. 58 లక్షల ఓట్లు గాయబ్
Follow Us On: X(Twitter)


