కలం డెస్క్ : బీసీలకు రిజర్వేషన్(BC Reservations) పెంచడంపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకూ ఏకాభిప్రాయమే ఉన్నది. చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు కూడా తెలిపాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ను 42% ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర సాధన విషయంలో అన్ని పార్టీలూ జెండా, ఎజెండాలను పక్కన పెట్టి ఒక్కటైనట్లుగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలోనూ అదే తీరులో ఐక్య పోరాటం చేస్తాయా?.. మద్దతు ప్రకటిస్తాయా?.. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కలిసొస్తాయా? ఇవి ఇప్పుడు కీలకంగా మారాయి.
క్రెడిట్ కోసం పార్టీల పాకులాట :
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం రాజకీయ పార్టీల మధ్య నిప్పును రాజసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42% కల్పిస్తున్నట్లు కాంగ్రెస్ చెప్పుకుంటున్నది. ప్రభుత్వానికి మద్దతు ఇస్తే కాంగ్రెస్ కు క్రెడిట్ ఇచ్చినట్లేనని బీఆర్ఎస్, బీజేపీల నేతలు భావిస్తున్నారు. ఇవ్వకపోతే బీసీల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న ఆందోళననూ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాము చావకుండా, కర్ర విరగకుండా ఎలా వ్యవహరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా బీసీలకు రిజర్వేషన్లు(BC Reservations) పెంచడాన్ని బీజేపీ, బీఆర్ఎస్ సైతం సమర్ధించాయి. ఇప్పుడు న్యాయస్థానాల్లో పిటిషన్లపై వాదనల సందర్భంగా ఏ పార్టీ ఎలాంటి వైఖరి తెలియచేస్తుందన్నది కీలకం.
రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీలు :
బీసీ సంఘాల ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ తరఫున మంత్రి వాకిటి శ్రీహరి సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి గంగుల కమలాకర్, మధుసూధనాచారి, పుట్టా మధు తదితర పలువురు హాజరయ్యారు. బీజేపీ తరఫున ఎంపీ ఆర్. కృష్ణయ్య, మరికొందరు హాజరయ్యారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) సైతం పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా బీసీ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ లీడర్లు ఏకం కావాలని ఈ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే తరహా స్ఫూర్తిని ప్రదర్శించి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లులకు మద్దతు లభించేలా, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసే చట్టబద్ధత కల్పించేలా సహకారాన్ని ఇవ్వాలన్న ఒత్తిడి పెరుగుతున్నది.

