ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) తన రాజీనామా వార్తలపై స్పందించారు. “నా రాజీనామా ప్రచారం అవాస్తవం. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదు. నేనంటే గిట్టని వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. రాజీనామా అనే ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు” అని దానం వెల్లడించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుందని, అయితే అంతకంటే ముందే సదరు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ అనుచరులతో రాజీనామా గురించి చర్చలు జరుపుతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలువడ్డాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubille Hills Bypoll) షెడ్యూల్ విడుదల అయ్యాక రాజీనామా చేసే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ప్రచారం కొనసాగింది. అయితే దానం నాగేందర్ మాత్రం ఆదివారం సాయంత్రమే మీడియా సమావేశం నిర్వహించి రాజీనామా చేయనున్నారనే వార్త సెన్సేషన్ గా మారింది. దీంతో అప్రమత్తమైన దానం(Danam Nagender) రాజీనామా వార్తలను ఖండించారు.

