కలం, వెబ్ డెస్క్: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. పంచాయతీ ఎన్నికలు గుర్తుల ఆధారంగా పోటీ చేయవన్న విషయం తెలిసిందే. దీంతో ఆయా పార్టీలు ఎవరికి తోచిన నంబర్ వారు చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఫలితాలపై కేటీఆర్ స్పందిస్తూ .. తాము కాంగ్రెస్ నిర్బంధాలను ఎదుర్కొని ఎంతో సమర్థంగా ఎక్కువ స్థానాలను గెలుచుకున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ మద్దతుదారులకు ఆయన అభినందనలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా ఫలితం దక్కలేదదని ఆరోపించారు. ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని కూడా తొలిదశ పంచాయతీ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయి.’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
‘సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవకపోవడం, అనేక చోట్ల 10, 20 ఓట్ల తేడాతోనే బయటపడటం చూస్తే కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైనట్టు స్పష్టంగా అర్థమైపోతోంది.’ అంటూ కేటీఆర్ ట్వీట్లో ప్రస్తావించారు.
‘రెండేళ్లు గడిచినా ఆరు గ్యారెంటీల పేరిట చేసిన సీఎం రేవంత్ మోసం, పెన్షన్ల పెంపు పేరిట చేసిన ద్రోహం, మహాలక్ష్మి పేరిట చేసిన దగా, తులం బంగారం పేరిట చేసిన నయవంచనను గ్రామీణ ప్రాంత ప్రజలు మరిచిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయి.’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారు తమ భాష్యాలు చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో గుర్తులు ఉండవు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులు తమ ఫలానా పార్టీ మద్దతుదారులమని చెప్పుకొన్నారు. దీంతో పార్టీలు ఎవరికి తోచినట్టుగా వాళ్లు విశ్లేషించుకుంటున్నారు.
Read Also: ట్రంప్ గోల్డ్ కార్డ్.. ఆ కంపెనీల చేతుల్లో భారత పౌరుల భవిష్యత్..?
Follow Us On: Instagram


