కలం డెస్క్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమికి తనతో పాటు మరొకరు కూడా బాధ్యులంటూ కెప్టెన్ సూర్యకుమార్(Suryakumar Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు సమష్టిగా రాణించి 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకోవడం మ్యాచ్‌కు కీలక మలుపు అయ్యిందని, బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని అంగీకరించాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), “టాస్ గెలిచిన మేము ముందుగా బ్యాటింగ్ చేయాల్సింది. బౌలింగ్ ఎంచుకోవడం వ్యూహపరమైన తప్పిదం. పిచ్ కండిషన్స్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసిన సమయంలో పిచ్ నెమ్మదిగా ఉండగా, మా బ్యాటింగ్ సమయానికి వేగం పెరిగింది. వారి బౌలర్లు ఏ లెంగ్త్‌లో వేయాలో ముందుగానే అర్థం చేసుకున్నారు” అని వెల్లడించాడు.
అలాగే ప్లాన్–బీ అమలు చేయడంలో విఫలమయ్యామని, తాము నేర్చుకునే దశలో ఉన్నామని తెలిపాడు. “కొద్దిగా మంచు కూడా ఉంది. మా మొదటి ప్లాన్ పనిచేయలేదు. రెండో ప్లాన్‌ను కూడా సరిగా అమలు చేయలేకపోయాం. అయినా ఇది మాకు మంచి గుణపాఠం. తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతాం” అని సూర్య పేర్కొన్నాడు. తనతో పాటు శుభ్‌మన్ గిల్(Shubman Gill) కూడా మెరుగైన ఆరంభం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశాడు. “ఎప్పుడూ అభిషేక్ శర్మపైనే ఆధారపడటం సరికాదు. అతనికీ ఒక ఆఫ్ డే ఉంటుంది. నేను, శుభ్‌మన్, ఇతర బ్యాటర్లు బాధ్యత తీసుకుని జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాలి” అని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.
Read Also: ఇండియా ఓటమికి కారణం చెప్పిన డికాక్
Follow Us On: X(Twitter)


