కలం, వెబ్‌డెస్క్: సాంకేతిక యుగంలో సంచలన ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). ప్రస్తుతం ఈ కృత్రిమ మేధ మన దైనందిన జీవితంలో భాగమైపోయింది. టెక్నాలజీ, వ్యాపారం, సమాజం.. ఒక్కటేమిటి అన్ని రంగాల్లోనూ విస్తరించింది. భవిష్యత్తు ఏఐదే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ప్రపంచానికి అందించి, విస్తృతం చేసిన ఎనిమిది మంది కృత్రిమ మేధ నిర్మాతల (AI Architects) ను టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2025’గా గుర్తించింది. వారిని తన కవర్‌పేజీపై సగర్వంగా కూర్చోబెట్టింది.
రెండు భాగాలుగా కవర్‌పేజీ :
టైమ్స్ కవర్‌పేజీ ఈసారి రెండు భాగాలుగా వచ్చింది. ఒక పేజీలో ఎనిమిది మంది టెక్ దిగ్గజాల (AI Architects) కు చోటిచ్చింది. వీరిలో హువాంగ్ (ఎన్విడియా), జుకెర్‌బర్గ్ (మెటా, ఫేస్బుక్), ఎలాన్ మస్క్ (ఎక్స్), శామ్ ఆల్ట్మాన్ (ఓపెన్ ఏఐ), డెమిస్ హస్సాబిస్ (డీప్‌మైండ్ టెక్నాలజీస్), డేరియో అమోడీ (ఆంత్రోపిక్)తో పాటు ఇద్దరు మహిళలు ఫీ–ఫీ లీ (స్టాన్ఫోర్డ్ హ్యూమన్ సెంటర్డ్ ఏఐ ఇన్స్టిట్యూట్), లిసా సు(అడ్వాన్డ్ మైక్రో డివైజ్ రూపకర్త) ఉన్నారు. వీరంతా ఒక ఇనుప బీమ్‌పై పక్కపక్కనే కూర్చొని ఉన్నట్లు చిత్రించారు. 1932 అమెరికా మహామాంద్యం సమయంలో తీసిన ‘లంచ్ ఏటాప్ ఎ స్కైస్రేపర్’ ఫొటో ప్రేరణతో దీన్ని చిత్రించారు. మరో కవర్ పేజీలో అక్షరాల రూపంలోని ఏఐని కొందరు నిర్మిస్తున్నట్లు చిత్రించారు. ఇందులో ఉన్నదీ టెక్ దిగ్గజాలేనని టైమ్స్ ఎడిటర్ శామ్ జేకబ్స్ తెలిపారు. కవర్‌పేజీపై కాకుండా విస్తృత కథనంలో భారతీయ మూలాలున్న ఆవిష్కర్తలు కరణ్‌దీప్ ఆనంద్, శ్రీరామ్ కృష్ణన్ పేర్లను, జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ అధిపతి మసయోషిని ప్రస్తావించినట్లు ఆయన వెల్లడించారు.
ఎబోలా ఫైటర్స్.. కంప్యూటర్:
టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా వ్యక్తిని కాకుండా ఒక బృందాన్ని ఎంపిక చేయడం ఇదే మొదటిసారి కాదు. 2002లో తొలిసారి విజిల్‌బ్లోయర్స్ పేరుతో ముగ్గురికి చోటు కల్పించారు. ఎబోలా వ్యాధిపై పోరాడిన వాళ్లకు గుర్తుగా 2014లో ఎబోలా ఫైటర్స్ పేరుతో ముఖచిత్రం వచ్చింది. అలాగే వ్యక్తుల్ని కాకుండా తొలిసారి 1982లో కంప్యూటర్‌కు కవర్‌పేజీపై అవకాశం కల్పించారు. 2006 పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా స్క్రీన్‌పై ఇంగ్లిష్ అక్షరాల్లో వైఓయు(యు)ను ముద్రించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృతమవుతున్న ఆన్లైన్ రంగంలో ప్రతి ఒక్కరి ప్రాతినిధ్యాన్ని సూచిస్తూ ఈ పేరుతో చిత్రించారు.
Read Also: ట్రంప్ గోల్డ్ కార్డ్.. ఆ కంపెనీల చేతుల్లో భారత పౌరుల భవిష్యత్..?
Follow Us On: Youtube


