కలం, నిజామాబాద్ బ్యూరో: ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) లిక్కర్ కిక్కు మామూలుగా లేదు. ఒక్క ఉమ్మడి జిల్లాలోనే 9 రోజుల్లోనే 90 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు మద్యం ఏరులై పారిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 151 వైన్స్, 29 బార్లు ఉన్నాయి. వీటికి మాక్లూర్ మండలం మాదాపూర్లోని ఐఎంఎల్ డిపో ద్వారా మద్యం సరఫరా అవుతోంది. నిత్యం 4 నుంచి 5 కోట్ల అమ్మకాలు జరుగుతుంటాయి.
రెట్టింపైన మద్యం అమ్మకాలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) నేపథ్యంలో అమ్మకాలు రెట్టింపయ్యాయి. గతేడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి 9 వరకు కేవలం 33కోట్ల వ్యాపారం సాగింది. ఇప్పుడు మాత్రం రికార్డు స్థాయిలో 90 కోట్ల మద్యం అమ్ముడు పోయింది. ఈ లెక్కన రోజుకు 10 కోట్లన్న మాట. ఒకటో విడత పోలింగ్ జరగక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక మూడో విడత పోలింగ్ ముగిసే సరికి అమ్మకాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్క ఒక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లాదే కావడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి
రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు జోరు కూడా అంచనాలకు మించి ఉంది. పల్లె పంచాయితీలో మద్యం ఏరులై పారుతోందండానికి ఈ లెక్కలే ఆధారం అని చెప్పాలి. మొదటి విడత జరుగుతున్న బోధన్ డివిజన్లో మద్యం దుకాణాలు ఇప్పటికే బంద్ అయ్యాయి. రెండో విడత జరగబోయే ఆర్మూర్ నిజామాబాద్ డివిజన్లలో మద్యం అమ్మకాలు మరింత పెరగనున్నాయి. ఇక్కడ అక్కడ తేడా లేకుండా అంతటా మధ్యాహ్నం, రాత్రి సిట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు. గత తొమ్మిది రోజుల్లోనే జిల్లా మొత్తం 90 కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయింది. ఇక నుంచి మొదటి విడత ప్రాంతాల్లో తగ్గి రెండో మూడో విడత ప్రాంతాల్లో అమ్మకాలు పెరగనున్నాయి. ఇక మూడో విడత ఎన్నికల నాటికి మద్యం కిక్కు ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాలి.
Read Also: ‘చీప్ లిక్కర్ పడ్తలేదు.. బ్రాండెడ్ మందు కావాలి’ ఓటర్ల డిమాండ్
Follow Us On: Youtube


