కలం డెస్క్ : ప్రపంచంతోనే పోటీపడేలా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల (3 Trillion Dollar Economy) ఎకానమీని సాధించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ (Telangana Vision Document) ను రూపొందించింది. ఇందుకోసం మూడంచెల వ్యూహాలను రూపొందించింది. క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) అనే మూడు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మొత్తం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి సమ్మళిత అభివృద్ధి లక్ష్యం ఈ విజన్ డాక్యుమెంట్‌లో ఉన్నదని ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు కొనియాడారు. రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌కు హాజరై రాష్ట్ర ప్రభుత్వ విజన్‌ను స్టడీ చేసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారు. మొత్తం 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పదుల సంఖ్యలో దేశ, విదేశీ కంపెనీలు అవగాహనా ఒప్పందాలు (MoU) కుదిరాయి.
ప్రజల ఆకాంక్షలు సాకారమయ్యేలా.. :
రాష్ట్ర, ప్రజల సమగ్ర అభివృద్ధిని ఉద్దేశించి ఈ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. నీతి ఆయోగ్, హైదరాబాద్ ఐఐటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, పలువురు ఆర్థికవేత్తలు, మేధావులు.. ఇలాంటివారితో మాత్రమే కాక నాలుగు లక్షల మంది రైతులు, విద్యార్థులు, యువత, మహిళల నుంచి కూడా ఆన్‌లైన్‌లో అభిప్రాయాలను తీసుకుని డాక్యుమెంట్‌లో ప్రభుత్వం పొందుపర్చింది. ప్రస్తుతం దేశ జీడీపీలో సుమారు 5% వాటాగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 10% ఉండేలా స్పష్టమైన విజన్‌ను ఈ డాక్యుమెంట్‌లో ప్రస్తావించింది. ప్రస్తుతం 18 లక్షల కోట్ల (బడ్జెట్ ఎస్టిమేట్స్) జీఎస్‌డీపీగా ఉన్న రాష్ట్ర ఎకానమీ అప్పటికల్లా 270 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దేశ జీడీపీ అప్పటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే అంచనాతో ఈ డాక్యుమెంట్‌ను రూపొందించింది.
ప్రపంచంతోనే పోటీ పడేలా.. :
పొరుగు రాష్ట్రాలు లేదా మెట్రో నగరాలతో పోటీ పడేలా కాకుండా ప్రపంచ నగరాలతో పోటీపడేలా ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్‌ను (Telangana Vision Document) రూపొందించింది. అభివృద్ధిలో ప్రపంచ దేశాల సరసన ధీటుగా నిలబడి దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుందన్నది ప్రభుత్వ ధీమా. ఆర్థికాభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి.. అనే మూడు మంత్రదండాలుగా పనిచేస్తాయని పేర్కొన్నది. అధునాతన సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక వనరులతో పాటు సుపరిపాలన ఈ ఆర్ధిక వృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేస్తాయన్నది ప్ఱభతువ భావన. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల్య, పరస్పర ఆధారిత వృద్ధిని సాధించే సంకల్పాన్ని ప్రస్తావించింది. మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంలో తొలుత పదేండ్ల నాటికి (2034 సంవత్సరం) కనీసం ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్ళాలన్నది ఒక కీలకమైన అంశం.
5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్ మెంట్స్ :
రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌లో దేశ, విదేశీ కంపెనీలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి. మొత్తంగా రూ. 5.75 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్ మెంట్లకు అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూ) కుదిరాయి. ఇందులో దాదాపు రూ. 3.24 లక్షల కోట్లు కేవలం విద్యుత్ ఉత్పాదనా రంగాలకు చెందినవే. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్, ఇన్నోవేషన్ హబ్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్, ఉత్పత్తి రంగం, టెక్స్ టైల్స్, ఏరో స్పేస్, డిఫెన్స్.. ఇలాంటి అనేక రంగాల్లో పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. దావోస్‌లో రెండేండ్లలో కలిపి రూ. 1.80 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరితే రెండు రోజుల సమ్మిట్‌లో మాత్రం దానికి మూడు రెట్లు దాటింది. దేశ, విదేశీ కంపెనీలు ఆసక్తి కనబర్చడానికి విజన్ డాక్యుమెంట్‌లో ప్రభుత్వం వివరించిన ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహం ప్రధాన కారణాలని సీఎం సహా మంత్రులంతా పలు సందర్భాల్లో ప్రస్తావించారు.
Read Also: తెలంగాణ విజన్ అద్భుతం: ఆనంద్ మహీంద్రా
Follow Us On: X(Twitter)


