కలం డెస్క్ : “తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉంది.. జల్, జంగల్, జమీన్ నినాదంతో కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇది… భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతోమంది నేలకొరిగిన చరిత్ర ఈ ప్రాంతానిది… స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది.. ఈ గడ్డమీదున్న ప్రజలు కన్న కలలు, ఆశలు, ఆకాంక్షలు కార్యరూపం దాల్చేందుకే ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను తీసుకొచ్చాం…” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. దీన్ని నాలుగు గోడల మధ్య కొద్దిమంది కూర్చుని తయారు చేసింది కాదు.. నాలుగు కోట్ల ప్రజల అభిప్రాయాలు తీసుకుని తయారు చేసింది.. అని అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ముగింపు రోజున విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.
పాలసీల్లో నెహ్రూ, గాంధీ విజన్ :
బ్రిటీషు వలస పాలన నుంచి విముక్తి పొంది మనదైన అభివృద్ధి కోసం తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అనేక రకాలుగా ఆలోచించారని, పాలసీల రూపకల్పనలో చాలామంది నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారని, ఇప్పుడు తెలంగాణ కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నదన్నారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు అప్పట్లో నెహ్రూ ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ నినాదాన్ని పరిగణలోకి తీసుకున్నామన్నారు. విద్యావకాశాలు పెరిగినా ప్రమాణాలు, నాణ్యత ఆశించిన స్థాయిల లేవని, నిరుద్యోగం పెరగడానికి ఇదొక కారణమన్నారు. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అందించాలనే సంకల్పంతో ఈ డాక్యుమెంట్ రూపొందిందని అన్నారు.
సామాజిక వివక్షకు ఇక చెల్లుచీటీ :
మారుమూల గ్రామంలో పెరిగిన తనకు సామాజిక వివక్ష, పేదరికం, ఆకలి, కష్టాలు.. ఇవన్నీ స్వయంగా అనుభవించినవాడినని, అందుకో ప్రజలందరి సమగ్రాభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్ (Vision Document) అవసరమైందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా కుల వివక్ష పోలేదని, విద్యార్థి దశలోనూ అది కొనసాగుతూనే ఉన్నదని, దీన్ని రూపుమాపేందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణానికి నడుం బిగించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. ఇలాంటి తేడాలేవీ లేకుండా అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకే స్కూల్‌లో చదివేలా రాష్ట్రంలో 100 స్కూళ్ళకు భారీగా నిధులను వెచ్చిస్తున్నామన్నారు. విద్య మీద పెట్టేది ఖర్చు కాదని, భవిష్యత్తు తరాలకు అవసరమయ్యే పెట్టుబడి అని అన్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకున్న తనకు ఇప్పటి యువతకు ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి ప్రమాణాలతో కూడిన విద్య అవసరమో గుర్తించి సాకారం చేయడం ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యత అని అన్నారు.
నిరుద్యోగాన్ని రూపుమాపేలా స్కిల్స్ :
పేదల కష్టాలు తెలిసినవాడిగా వారికి ప్రభుత్వం తరఫున సంక్షేమ ఫలాలు అందించాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఉన్నతమైన రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని అప్పట్లో సోనియాగాంధీ, మన్‌మోహన్‌సింగ్ కలలుగన్నారని, కానీ అది ఆమడదూరంలోనే ఉన్నందున ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ అవసరమైందన్నారు. నాణ్యమైన విద్య, స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతున్నదని, డిగ్రీలు చదివినా కొలువులు రావడం గగనంగా మారిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే యువతలో నైపుణ్యం పెంపొందించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు విజేతలుగా నిలవాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని సైతం నెలకొల్పినట్లు గుర్తుచేశారు. అట్టడుగు వర్గాల, పేదల అభివృద్ధి కోసమే తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ అని Revanth Reddy నొక్కిచెప్పారు.
Read Also: రాష్ట్ర భవిష్యత్‌గా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్
Follow Us On: Youtube


