నిజామాబాద్(Nizamabad) జిల్లాలో ఘోరం జరిగింది. లిఫ్ట్ ఇచ్చినట్లే ఇచ్చి మహిళను హతం చేశాడో వ్యక్తి. అనంతరం మహిళ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. స్థానిక సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నాండేద్ జిల్లా కొండల్ వాడికి చెందిన శీలంవార్ లింగవ్వ(55) బతుకమ్మ పండగ నేపథ్యంలో జమ్లంలోని తన కూతురి ఇంటికి వచ్చింది.
ఈ క్రమంలోనే జైతాపూర్‌కు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత నిర్మానుష్య ప్రాంతం చూసి మహిళను హత్య చేశాడు. ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగలించి పరారవ్వడానికి రెడీ అయ్యాడు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.
పోలీసులకు సమాచారం అందించి.. నిందితుడిని వారికి అప్పగించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగానే మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ఎవరిని పడితే వారిని నమ్మి లిఫ్ట్ ఎక్కి వెళ్లొద్దని పోలీసులు సూచించారు.

