epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాజసానికి కేరాఫ్.. హైదరాబాద్ హౌస్

కలం, వెబ్ డెస్క్: వివిధ దేశాధినేతలు, ప్రముఖులు భారత్‌లో పర్యటిస్తున్నప్పడు వారితో భేటీ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు హైదరాబాద్ హౌస్(Hyderabad House). దేశ రాజధానిలో తెలుగు వారి ఠీవికి, తెలంగాణ వైభవానికి ప్రతీకగా భాసిల్లుతున్న రాజభవనం. దాదాపు వందేళ్ల నాటి ఈ పురాతన కట్టడం స్వాతంత్ర్యం అనంతరం వివిధ దేశాధినేతల, ప్రముఖులతో భేటీకి చిరునామాగా నిలుస్తోంది. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ మరోసారి ఈ భవనం గురించి చర్చ జరుగుతోంది.

ఎంతో ఘన చరిత:

దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని 1911లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు కార్యాలయాల తరలింపు, కొత్త వాటి నిర్మాణం మొదలుపెట్టింది. అదే సమయంలో తెలంగాణను నిజాం చివరి నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్(Osman Ali Khan) పాలనలో ఉండేది. ఢిల్లీలో రాష్ట్రం తరఫున ఒక అద్భుతమైన భవనం ఉండాలని మీర్ ఉస్మాన్ అలీఖాన్ భావించాడు. వెంటనే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని సంప్రదించాడు. బ్రిటిష్ వైస్రాయ్ భవనం ఉన్న ప్రాంతానికి సమీపంలోని పార్కు స్థలం కావాలని కోరాడు. అయితే, అలీఖాన్ విజ్ఞప్తిని తిరస్కరించిన బ్రిటీష్ గవర్నమెంట్ వైస్రాయ్ భవంతికి 3 కిలోమీటర్ల దూరంలోని స్థలం కేటాయించింది.

మరో నాలుగు సంస్థానాలు బరోడా, పాటియాలా, జైపూర్, బికనీర్ సంస్థానాలకు కూడా అక్కడికి చుట్టుపక్కలే స్థలాలు ఇచ్చింది. తనకు కేటాయించిన స్థలంతో భవనం నిర్మాణం తలపెట్టిన అలీఖాన్.. బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఎడ్విన్ లూటెన్స్‌కు బాధ్యతలు అప్పగించాడు. అచ్చం వైస్రాయ్ భవనంలా కట్టించాలని అనుకున్నా, బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో వైస్రాయ్‌లోని మధ్య భాగంలో ఉన్న గోపురం లాంటి నిర్మాణాన్ని పోలిన భవనాన్ని అత్యంత సుందరంగా, అన్ని వసతులతో కట్టించాడు.

సీతాకోక చిలుక ఆకారంలో..:

మొత్తం 8.2 ఎకరాల్లో పార్కులు, ఫౌంటెన్లు, తోటలు, తోరణాలు, అద్బుతమైన మెట్లుతో మొఘల్ నిర్మాణ శైలిలో హైదరాబాద్ హౌస్(Hyderabad House) ఉంది. ఇందులో 36 గదులు, 12 టైల్డ్ బాత్‌రూమ్‌లు ఉన్నాయి. అలాగే 12-15 గదులతో మహిళల కోసం ప్రత్యేక అంత:పురం కూడా ఉంది. స్వాతంత్య్రం వచ్చే నాటికే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పేరొందిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ భవానాన్ని అన్ని హంగులతో నిర్మించాడు. అప్పట్లోనే దీనికి 2.40కోట్ల మేర ఖర్చు అయింది. ఇది ప్రస్తుతం రూ.170 కోట్లకు సమానం. 1947లో దేశానికి స్వాతంత్ర్యం రావడం, 1948లో తెలంగాణ సంస్థానం భారత్‌లో విలీనం కావడంతో హైదరాబాద్ హౌస్ భారత్‌కు సొంతమైంది. 1974 నుంచి ఈ భవనాన్ని దౌత్య అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ భవనంలో బిల్ క్లింటన్, జార్జ్ బుష్, పుతిన్, గోర్డాన్ వంటి వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు జరిగాయి. వందేళ్లవుతున్నా వన్నె తగ్గని ఈ సౌధం రాజసానికి కేరాఫ్ అడ్రస్.

Read Also: 1942 చ.కి.మీ. విస్తీర్ణంతో మెగా హైదరాబాద్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>