epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘ఏవీఎం’ సారథి శరవణన్ కన్నుమూత

సినీనిర్మాత, ఏవీఎం స్టూడియోస్‌ సారథి ఏవీఎం శరవణన్ (86) (AVM Saravanan) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్యసమస్యలు, అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఏవీఎం స్టూడియో ప్రాంగణంలోని తన నివాసంలోనే ఉదయం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని నెలలుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శరవణన్.. ఇటీవలే ఇంటికి వెళ్లారు. శరవణన్ తన 86వ జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్న మరుసటి రోజే చనిపోవడంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొన్నది.
‘ఏవీఎం’ శరవణన్ (AVM Saravanan) సినీ సామ్రాజ్యానికి కేరాఫ్ అడ్రస్
శరవణన్ ఏవీఎం సినీ సామ్రాజ్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.  తన తండ్రి ఏవీఎం మెయ్యప్పన్ 1945లో ఈ సంస్థను స్థాపించారు. చెట్టియార్ నుంచి ఆయన ఏవీఎంను వారసత్వంగా పొందారు. మెయ్యప్పన్ మూడో కుమారుడైన శరవణన్, 1958వ సంవత్సరం నుంచి ప్రొడక్షన్స్ బాధ్యతలను నిర్వహించారు. ఏవీఎం సంస్థను దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సినీ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలపడంలో శరవరణన్‌ది కీలక పాత్ర. ఏవీఎం సంస్థ నిర్మించిన ‘నానుం ఒరు పెణ్’, ‘సంసారం అది మిన్సారం’, ‘శివాజీ’, ‘వేట్టైయాడు విలయాడు’, ‘మిన్సార కనవు’, ‘అయన్’ ఇలాంటి అనేక తమిళ చిత్రాలు సినీ చరిత్రలో మైలురాళ్లు. నాణ్యతతోపాటు అప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని జోడించి కొత్త ప్రమాణాలు నెలకొల్పడంలో ఏవీఎం స్టూడియోస్ తనదైన ముద్ర వేసుకున్నది.
రజనీ, కమల్ లాంటి నటులతో
సూపర్‌స్టార్‌ రజనీకాంత్, కమల్‌హాసన్‌ కెరీర్ ప్రారంభదశలో శరవణన్ (Saravanan) అందించిన అవకాశాలు వారి ఎదుగుదలకు బలమైన పునాది అయ్యాయని తమిళ సినీ వర్గాలు గర్వంగానే చెప్పుకుంటాయి. ఎంతోమంది ప్రతిభావంతులను ప్రోత్సహించి, కొత్త తరానికి మార్గనిర్దేశం చేయడంలో ఏవీఎం స్టూడియోస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. శరవణన్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 4 గంటల వరకు ఏవీఎం స్టూడియోస్‌ (AVM Studios)లోని మూడో అంతస్తులో ఉంచి ఆ తర్వాత అక్కడి ఎలక్ట్రిక్ క్రిమటోరియంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తిచేయనున్నారు.
ప్రస్తుతం ఏవీఎం నిర్వహణ బాధ్యతలను ఆయన కుమారుడు ఎంఎస్ కుగన్ చూసుకుంటున్నారు. శరవణన్ మృతిపట్ల తమిళ సినీ ప్రముఖులు, అభిమానులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Follow Us on: Facebook
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>