కలం డెస్క్ : ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాల్లోనే కాక తలసరి నెల జీతం (Salary) లోనూ ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఉన్నత స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ (Forbes) అధ్యయనంలో తేలింది. దేశం మొత్తం మీద ఎక్కువ జీతం అందుకుంటున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఫోర్త్ ప్లేస్‌లో నిలిచింది. అత్యధిక సగటు వేతనం అందుకుంటున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత స్థానం తెలంగాణదే. ఇటీవల ‘ఫోర్బ్స్ అడ్వయిజర్’ (Forbes Advisor) అనే సంస్థ నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. వృత్తులవారీగా, నగరాలవారీగా ప్రతి నెలా అందుకుంటున్న వేతనాలను విశ్లేషించింది. ఢిల్లీలో నెలకు సగటున రూ. 35 వేల జీతాన్ని అందుకుంటూ ఉంటే, మహారాష్ట్రలో రూ. 33 వేలు, కర్ణాటకలో రూ. 32 వేలు, తెలంగాణలో రూ. 31 వేల చొప్పున అందుకుంటున్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇది రూ. 26 వేలకే పరిమితమైంది. దేశవ్యాప్త సగటు రూ. 28 వేలు.
8వ స్థానంలో హైదరాబాద్ నగరం :
నగరాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నవారు అందుకుంటున్న వార్షిక వేతనం సగటున రూ. 18.62 లక్షలుగా తేలింది. ఆ ప్రకారం నెలకు రూ. 1.55 లక్షల చొప్పున అందుకుంటున్నారు. అన్నింటికంటే అత్యధికంగా షోలాపూర్‌లో రూ. 28 లక్షలు, ముంబైలో రూ. 21.17 లక్షలు, బెంగళూరులో రూ. 21.01 లక్షలు, ఢిల్లీలో రూ. 20.43 లక్షలు, భుభనేశ్వర్‌లో రూ. 19.94 లక్షలు, జోధ్‌పూర్‌లో రూ. 19.44 లక్షలు, పూణెలో రూ. 18.95 లక్షల చొప్పున సంవత్సర సగటు జీతం తీసుకుంటుండగా 8వ స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో ఇది రూ. 18.62 లక్షలుగా తేలింది. వృత్తులరీత్యా చూస్తే అత్యధికంగా ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ రంగంలో ఉన్నవారు రూ. 35 లక్షలు (సంవత్సరానికి), మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌లు రూ. 34 లక్షలు, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ రూ. 33 లక్షలు, డాటా సైంటిస్ట్ రూ. 26 లక్షలు అందుకుంటున్నట్లు తేలింది. ఇది హయ్యెస్ట్ శాలరీ మాత్రమేనని లోయెస్ట్ (కనిష్టం) లెక్కల్లో ఇదే వృత్తుల్లో ఉన్నవారు రూ. 14 లక్షలు, 11 లక్షలు, 9.6 లక్షలు, 9.5 లక్షల చొప్పున అందుకుంటున్నారు. డాక్టర్లు సంవత్సరానికి అత్యధికంగా రూ. 17 లక్షల చొప్పున అందుకుంటున్నారు.
Read Also: సర్పంచ్‌లుగా మంచోళ్లను ఎన్నుకోండి : సీఎం రేవంత్
Follow Us on: Facebook


