కలం, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా సరెండర్ బాట పట్టడంతో పలు రాష్ట్రాల పోలీసులకు ఇప్పుడు ఆ పార్టీ టాప్ మోస్ట్ లీడర్ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి (Maoist Ganapathi) టార్గెట్‌గా మారారు. ఆయనను కూడా పట్టుకుంటే మొత్తం మావోయిస్టు పార్టీని భూస్థాపితం చేసినట్లవుతుందన్నది కేంద్ర ప్రభుత్వ భావన. ఆయన ఆచూకీ కోసం గత కొన్ని నెలలుగా కేంద్ర, రాష్ట్రాల ఇంటెలిజెన్స్ పోలీసులు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు లొంగిపోయిన నేతల నుంచి అవసరమైన ఇన్‌పుట్స్ తీసుకున్నారు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులకు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. నేపాల్‌లోని పశుపతినాధ్ ఆలయం సమీపంలోని ఒక ఆశ్రమంలో (కుటీరం) ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు అక్కడికి చేరుకుని గణపతికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తీసుకున్నారు. ఇక లాంఛనంగా ఆయనను అదుపులోకి తీసుకుని తెలంగాణకు తరలించడమే తరువాయి.
కదలలేని స్థితిలో మంచానికే పరిమితం :
ఐదారేండ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గణపతి వైద్య చికిత్స నిమిత్తం అడవిని విడిచి పట్టణ ప్రాంతాలకు చేరుకున్నారు. ఆపరేషన్ కగార్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్న సందర్భంగానే ఆయన నేపాల్‌కు చేరుకున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర పోలీసులకు మాత్రం ఈ సమాచారం చాలా ఆలస్యంగా తెలిసింది. మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు పోలీసుల అదుపులోకి వచ్చి సరెండర్ కావడానికి ముందే గణపతికి సంబంధించిన వివరాలన్నింటినీ కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు సేకరించి పెట్టుకున్నారు. కొన్ని వారాల క్రితం నేపాల్‌లోని ఓ ఆశ్రమంలో మెడిటేషన్, మెడికేషన్ తీసుకుంటున్నట్లు వివరాలు అందాయి. అప్పటి నుంచీ ఆయనపై నిఘా కొనసాగుతూనే ఉన్నది. అనేక రకాల అనారోగ్య సమస్యలతో పాటు వృద్ధాప్యానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయని, మంచానికి మాత్రమే పరిమితమయ్యారన్నది తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసుల సమాచారం. కదలలేని స్థితిలో ఎప్పుడూ ఒక అటెండెంట్ వెంట ఉండాల్సి వస్తున్నదని సూచనప్రాయంగా తెలిపారు.
కేంద్ర బలగాలకు లొంగే ప్రసక్తే లేదు :
ఆశ్రమంలో ఉంటున్న గణపతిని (Maoist Ganapathi) తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు సంప్రదించినట్లు తెలిసింది. తాజా ఆరోగ్య సమస్యల రీత్యా ఎక్కడికీ కదలలేని స్థితిలో ఉన్నందున ఆయనతో చాలా విషయాలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. పార్టీలోని తాజా పరిస్థితులపై గణపతికి పూర్తి స్థాయిలో సమాచారం లేదని, వివరించిన తర్వాత మానసిక స్థితి రీత్యా స్పందన కూడా అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయన ప్రాణానికి హాని కలిగించబోమనే హామీతో పాటు సరెండర్ కావాలన్న ప్రతిపాదనను ఆయన ముందు ఉంచినట్లు తెలిసింది. కేంద్ర భద్రతా బలగాలకు ఎట్టి పరిస్థితిలో లొంగిపోయే ప్రసక్తే లేదని, తెలంగాణ పోలీసులు దగ్గర సరెండర్ కావడానికి మొగ్గు చూపినట్లు సమాచారం. అరెస్టు లాంటి సరెండర్ తరహాలో ఆయనను పోలీసులు ఈ వారంలోనే తెలంగాణకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. దీనికంటే ముందే ఆయన భార్య జోడె రత్నాబాయి అలియాస్ సుజాతక్క సహా పలువురి సరెండర్‌ను లేదా అరెస్టును తెలంగాణ పోలీసులు ప్రకటించనున్నట్లు సమాచారం.
Read Also: సిద్ధిపేట్‌లో కవిత vs హరీశ్.. సంచలన ఆడియో లీక్..!
Follow Us On: Youtube

