కలం, మెదక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దిపేట (Siddipet) తన ఫస్ట్ ఛాయిస్ అని ప్రకటించి సంచలనం సృష్టించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్షేత్రస్థాయిలో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారా? అందుకు సిద్దిపేట ప్రజల అభిప్రాయాలను సర్వే తరహాలో ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈ నెల 19 తేదీన సిద్దిపేట నుంచే పోటీచేసే ఆలోచన ఉందని కవిత మీడియాలో చెప్పినా తరువాత … సిద్దిపేట నియోజకవర్గంలో మీరు కవితకు మద్దతిస్తారా? లేక హరీశ్‌రావు (Kavitha vs Harish Rao) కు ఇస్తారా? అంటూ స్ధానిక ప్రజలకు సర్వే తరహా బల్క్ ఫోన్ కాల్స్ రావడం సిద్దిపేట చర్చనీయంగా మారింది. వివిధ వర్గాల ప్రజలకు ఈ తరహా కాల్స్ వస్తున్నాయి.
కాల్ వస్తున్న విధానం
నమస్కారం.. రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట ఎమ్మెల్యేగా శ్రీమతి కల్వకుంట్ల కవిత, హరీష్ రావు పోటీ చేస్తే…వీరిలో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు. కల్వకుంట్ల కవిత అయితే 9 నొక్కండి, హరీష్ రావు అయితే 4 నొక్కండి, ఇద్దరికి కాదు అయితే 2 నొక్కండి… అంటూ కాల్స్ వస్తుండటం టాక్ ఆఫ్ సిద్దిపేటగా మారింది. కవిత పోటీకి సిద్ధం అని చెప్పిన తర్వాతనే… సిద్దిపేటలోని ప్రజలకు కాల్ చేస్తుండంతో ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది
హరీష్ రావులాంటి బలమైన లీడర్‌కు సవాలు విసిరి సిద్దిపేట బరిలో ఉంటానని చెప్పిన కవిత… పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. రెండున్నరేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆమె క్షేత్రస్ధాయిలో పని చేయాలని చూస్తున్నారు. అందుకు వివిధ పద్ధతుల్లో సర్వేలను నిర్వహిస్తునట్టు సమాచారం. అంతేకాకుండా రానున్న రోజుల్లో సిద్దిపేటలో క్షేత్రస్ధాయిలో కుడా కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అందులో భాగంగా రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ జాగృతి అద్వర్యంలో ఉమ్మడి జిల్లాల్లో ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఇఫ్తార్ విందును సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసి కవిత హాజరు కానున్నారని సమాచారం. తరచూ సిద్దిపేటలో పర్యటించడంతో పాటు, పార్టీ ప్రకటన తర్వాత మరింత స్పీడ్ పెంచే ఆలోచనలో ఉన్నట్టు చర్చ నడుస్తోంది.
కేసీఆర్ కుటుంబానికి కంచుకోట
హరీశ్‌రావు రాజకీయాల్లోకి వచ్చింది మొదలు సిద్దిపేట నుంచే పోటీ చేస్తున్నారు. మొదటిసారి 2004 ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి అదే నియోజకవర్గంలో వరుస విజయాలు సాధిస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో వేరే ఏ పార్టీకి అవకాశం ఇవ్వకుoడా వరుసగా ఏడుసార్లు హరీశ్‌రావు గెలిచారు. నియోజకవర్గంలో రాజకీయంగా తనకు ప్రత్యర్ధులు అనేవారే లేకుండా అందనంత దూరంలోనే ఉన్నాడు. అలాగే కేసీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసింది మొదలు సిద్దిపేట నియోజకవర్గంలోనే. కేసీఆర్ కుటుంబం తప్ప వేరే వారు గెలిచిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైమ్ 1985లో టీడీపీ నుంచి గెలిచిన కేసీఆర్ వరుసగా నాలుగు సార్లు విజయం సాధించాడు. అలా గత నలబై యేళ్లుగా సిద్దిపేటలో కేసీఆర్ లేదా హరీష్ రావు మాత్రమే ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.
గత నలభై యేళ్లుగా ప్రత్యర్థులుగా ఎవరున్నా కేసీఆర్ (KCR) కుటుంబం వైపే సిద్దిపేట ప్రజలు నిలిచారు. అలాంటిది అనూహ్యంగా కేసీఆర్ కుటుంబంలోని ఇద్దరి మధ్య పోటీ ఉంటే ఏమౌతుందనే అంశంపై స్ధానికంగా చర్చ జరుగుతుంది. అంతేకాకుండా కేసీఆర్, హరీశ్ రావులకు మాత్రమే కాక బీఆర్ఎస్ పార్టీకే కంచుకోటగా ఉన్న సిద్దిపేటలో కొత్త పార్టీ పెట్టి కవిత పోటీ చేస్తానని అనడంతో తెలంగాణ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిద్దిపేట ఫస్ట్ చాయిస్ అని ప్రకటించడంతో ‘హరీశ్‌రావు వర్సెస్ కవిత’ (Kavitha vs Harish Rao)గా భవిష్యత్తులో బిగ్ ఫైట్ కు దారితీయనుందా అని మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ కూతురు ఒకవైపు, మేనల్లుడు మరో వైపు బరిలో ఉంటే సిద్దిపేట ప్రజలు ఏ తీర్పు ఇస్తారో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు.
Read Also: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 264 మంది పోకిరీలకు పోలీసుల ట్రీట్మెంట్
Follow Us On: Youtube

