కలం, వెబ్ డెస్క్: బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ కావడంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. ఏపీలో మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు కుమారుడి యాక్సిడెంట్ వ్యవహారంపై జగన్ (YS Jagan) స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ మండిపడ్డారు. దానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారాన్ని ఉదహరించారు. తెలంగాణలో కేంద్ర మంత్రి కొడుకుపై ఆరోపణలు వస్తే తన కొడుకును తీసుకెళ్లి పోలీసుల ముందు నిలబెట్టాడన్నారు. న్యాయ పరంగా కొట్లాడటానికి సిద్ధమయ్యారని చెప్పారు. కానీ, జగన్ ఇలా చిన్న పిల్లాడు తప్పు చేస్తే కేసు పెట్టారని దాన్ని సమర్థించుకోవడం సరికాదన్నారు. కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ విస్తరణ ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
ఇక జగన్ తన సొంత బాబాయ్‌నే హత్య చేశాడని లోకేశ్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఈ విషయాన్ని కడపలో యువగళం పాదయాత్ర చేసినప్పుడు కూడా చెప్పానన్నారు. ఇలా హత్యలు చేసే మనస్తత్వం ఉంది కాబట్టే, వైసీపీకి చెందిన వాళ్లు ఒకరిని హత్య చేసినా జగన్ తప్పు కాదంటున్నారని మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో కంపెనీలు తీసుకురావడం చేతకాక తాము తీసుకొచ్చిన కంపెనీలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
తమ పార్టీపై, నేతలపై ఇష్టారీతిన మాట్లాడి వైసీపీ బ్యాచ్ రెచ్చగొడుతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. తనతో పాటు తమ పార్టీ వాళ్లు నీతి నిజాయితీతో బతుకుతామని, తాము తప్పు చేస్తే తమ నాయకుడు వదిలిపెట్టడని అన్నారు. దేవుడి దయ వల్ల జగన్‌లాంటి వ్యక్తి తమకు నాయకుడిగా లేడని చెప్పారు. గతంలో వైసీపీ వాళ్లు తమ నాయకుడిపై ఎన్ని కేసులు పెట్టినా ఒక్కటి కూడా నిలబడలేదన్నారు.
ఏపీని గొప్పగా అభివృద్ధి చేయాలన్న కసి తనలో ఉందని లోకేశ్ తెలిపారు. స్థానికంగా ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి, యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో కట్టబట్టలతో వెళ్లగొట్టారని, కనీసం రాజధాని ఎక్కడో కూడా చెప్పలేదని, రాజధానిని నిర్మాణానికి నిధులు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయని, ఒక్కో మెట్టు ఎక్కుతూ సొంత కాళ్లపై నిలబడుతున్నామని చెప్పారు.

