2027 మార్చి నాటికి పోలవరం పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) వ్యాఖ్యానించారు. రాష్ట్ర రైతన్నలు పండించిన పంటలు తుఫాన్ల బారిన పడి నష్టపోకుండా ఉండేందుకే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టామని వివరించారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా- గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.

భూగర్భజలాలను పెంచుతాం..

గోదావరి ప్రాంతంలో ధవళేశ్వరం, కృష్ణానదిపై కృష్ణా బ్యారేజీని సర్ ఆర్థర్ కాటన్ నిర్మాణం చేశారని.. ఇది ఏపీని దేశానికే అన్నపూర్ణగా మార్చిందని సీఎం కొనియాడారు. కేఎల్ రావు ఈ ప్రాజెక్టులను ఆధునీకరించి డెల్టాను సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. శివరామకృష్ణయ్య, కేఎల్ రావు తర్వాత ఏపీ సాగునీటి రంగంపై ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాగులు, వంకలు, నీటి ఊటలు అడుగంటిపోయాయని, భూగర్భజలాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తాం..

రాష్ట్రంలో ప్రతీ ఎకరాకు సాగునీటిని అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తరలించటం వల్లే శ్రీశైలంలో నీటిని పొదుపు చేసుకోగలిగామని చెప్పారు. అక్కడి నుంచి రాయలసీమకు నీటిని తరలించేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. ఇందుకోసం 2024 నుంచి రెండేళ్లలో రూ.24 వేల కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. తుంగభద్ర డ్యామ్‌కు కొత్త గేట్లను ఏర్పాటు చేయించామని అన్నారు. అలాగే ధవళేశ్వరం బ్యారేజీకి కూడా రూ.152 కోట్లతో కొత్తగేట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించామని చెప్పుకొచ్చారు.

2027 మార్చి నాటికి పోలవరం.

2014-19లో పోలవరం ప్రాజెక్టులో 72 శాతం పనులు పూర్తి చేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు 89 శాతం మేర పూర్తి చేశామని తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. ఇప్పటీకే ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.2,250 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే నేరుగా గ్రావిటీ ద్వారానే పంటపొలాల్లోకి నీరు వస్తుందని చెప్పారు. వంశధార నది నుంచి పెన్నా నది వరకు రాష్ట్రంలో నదులు అనుసంధానం జరగాలన్నదే తన ఆకాంక్ష అని సీఎం చెప్పుకొచ్చారు. సముద్రంలోకి వెళ్లే నీటిని సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుందని ఆకాంక్షించారు. ప్రాధాన్యతా క్రమంలో 36 ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>