కలం, వెబ్ డెస్క్: పగలు సెలూన్ నడుపుతూ, రాత్రి మాఫియా సామ్రాజ్యంలో లేడీ డాన్‌గా పనిచేసే ఓ కిలాడీ ఉదంతమిది(Lady Don Neha). చేసిన తప్పులు ఆధారాలతో సహా బయటపడడంతో పోలీసులకు చిక్కి, ఊచలు లెక్కిస్తోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. ఖుస్నుమ అన్సారీ అలియాస్ నేహా ఢిల్లీలో ఓ సెలూన్ నడుపుతోంది. అందులోనే బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. అయితే, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై దర్యాప్తులో భాగంగా ఇటీవల పోలీసులు కొంతమందిపై నిఘా పెట్టారు. అందులో బాబీ కబూతర్(అసలు పేరు మహ్పూజ్) ఒకరు.
గన్‌మెన్ అయిన బాబీ.. బిష్ణోయ్ గ్యాంగ్‌కు ఆయుధాలు సరఫరా చేసేవాడు. అతను నేహా గ్యాంగ్‌లో సభ్యుడని తేలింది. నేహా గురించి ఆరా తీయగా, సెలూన్ నడుపుతున్నట్లు తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు. పగలు బ్యూటీషియన్‌గా సెలూన్ నడుపుతూ రాత్రిళ్లు మాఫియా సామ్రాజ్యంలో లేడీ డాన్‌గా నేహా చెలామణీ అవుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. వెంటనే నిఘా పెట్టి ఆమెతోపాటు బాబీ, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
కాగా, ఇటీవల కాలంలో మాఫియా గ్యాంగ్ కార్యకలాపాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవలే అరెస్ట్ అయిన దీపా, జోయా ఖాన్ తర్వాత నేహా (Lady Don Neha) మూడో ‘లేడీ డాన్’ అని చెప్పారు.
ప్రజలకు నేహా బ్యూటీ పార్లర్ నడుపుతున్నట్లు కనిపించినా, అది గ్యాంగ్ అక్రమ కార్యకలాపాలకు ముసుగు మాత్రమేనని పోలీసులు తెలిపారు. నేహాను మేడమ్ జహర్గా అనుచరులు పిలుస్తున్నట్లు చెబుతున్నారు. వీళ్లను మహిపాల్పూర్ ఫ్లై ఓవర్ సమీపంలో అరెస్ట్ చేసినప్పుడు వాళ్ల దగ్గర నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


