కలం, తెలంగాణ బ్యూరో: ‘మిషన్ కాకతీయతో చెరువులు బాగుపడ్డాయి.. చాలాచోట్ల అలుగు దుంకుతున్నాయి.. కాళేశ్వరం ప్రాజెక్టుతో సమ్మర్‌లోనూ రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉన్నాయి..’ అని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తరచూ చెప్తూ ఉంటారు. ‘గోదావరి జలాలు సూర్యాపేట వరకూ వస్తున్నాయి. కాళేశ్వరం సృష్టించిన అద్భుతం ఇది’ అంటూ జగదీశ్‌రెడ్డి కూడా గంభీర ప్రకటనలు చేశారు. బీఆర్ఎస్ నేతల మాటలు ఇలా ఉంటే.. తెలంగాణ నీటిపారుదల (Telangana Irrigation) రంగానికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లెక్కలు మరోలా ఉన్నాయి.
రాష్ట్రంలో 2017-18 నుంచి 2023-24 మధ్య కాలంలో 6,249 చెరువులు, కుంటలు మాయమైనట్లు 2025లో నిర్వహించిన డిజిటల్ సర్వేలో తేలింది. అదే కాలంలో రైతులు కొత్తగా 1,66,959 బోర్లు వేసినట్టు వెల్లడైంది.మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడిక తీసి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచినా.. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుతో సమ్మర్‌లోనూ రైతులకు పుష్కలంగా నీరు అందుతున్నదని చెప్పినా.. చెరువులు, కుంటలు ఎందుకు తగ్గిపోయాయో? బోర్లు ఎందుకు కొత్తగా వేయాల్సి వచ్చిందో? సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది.
తెలంగాణలో మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. వాతావరణ మార్పులతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతున్నాయని, ఆశించిన స్థాయిలో వరదలు రావడం లేదని, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని సర్వే వెల్లడించింది. ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్‌కు సంబంధించి భూగర్భ నీటి వనరులు 2017-18లో 94 శాతం ఉంటే 2023-24 నాటికి 95 శాతానికి పెరిగాయని.. కానీ ఉపరితల నీటి వనరులు మాత్రం 6 నుంచి 5 శాతానికి తగ్గాయని వివరించింది.
అయితే మొత్తం బోరుబావుల్లో 97.83% (17,08,323) ప్రైవేటు వ్యక్తులకు చెందినవేనని తెలిపింది. ఉపరితల నీటి కుంటల్లోనూ 46.93% (46,958) ప్రైవేట్ వ్యక్తులవేనని వెల్లడించింది. మిగిలిన 47,412 చెరువులు, కుంటలు ప్రభుత్వానికి, ఫార్మర్స్ గ్రూపులకు చెందినవని నిర్ధారించింది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గుతున్నందు వల్లనే కొన్ని చెరువులు, కుంటలు ఎండిపోగా.. కొత్త బోరుబావులు వేసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు చూస్తున్న ఎల్ నినో కంటే ముందే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు సర్వే ద్వారా స్పష్టమవుతున్నది.
బోరుబావులే అధికం..
రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ రంగంలో దాదాపు 97.8% బోరుబావులేనని ఈ సర్వేలో తేలింది. చెరువులు, కుంటలు, బోరుబావులు, దిగుడుబావులు.. వీటన్నింటినీ కలుపుకుంటే మొత్తం 18,40,578 ఉన్నట్టు జలశక్తి శాఖ సర్వేలో తెలిపింది.వీటిలో 95.2% (17,52,607) ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే, కేవలం 3.1% (56,970) మాత్రమే ప్రభుత్వ పరిధిలోనివి. స్వల్పంగా 1.7% (31,001) ఫార్మర్స్ గ్రూపుల చేతుల్లో ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులకు చెందిన 17,52,607 చెరువులు, బావులు, బోర్లలో 89% (15,57,528) రెండు హెక్టార్ల కంటే (ఐదెకరాలు) తక్కువ సాగు విస్తీర్ణమున్న చిన్న రైతులకు చెందినవే. మిగిలిన 11% మధ్యతరహా రైతులు, భూస్వాములుకు చెందినవిగా సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలోని మొత్తం 18,40,578 నీటి వనరుల్లో 98.2% (18,07,556) వినియోగంలో ఉన్నాయి. మిగిలినవాటిలో 12,604 (0.7%) ప్రస్తుతానికి వినియోగంలో లేకపోగా, మరో 1.1% (20,418) పర్మినెంట్‌గా పనికిరానివని నిర్ధారణ అయింది. తాత్కాలికంగా పనికిరాని 12,604 నీటి వనరుల్లో 10,232 బోరుబావులే. పర్మినెంట్‌గా పనికిరానివి 20,418 ఉండగా, వాటిలో 16,074 బోరుబావులే. మిగిలినవి 4,344 చెరువులు, కుంటలు.
మైనర్ ఇరిగేషన్ లెక్క ఇదీ
తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ వనరులపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 18,40,578 మైనర్ ఇరిగేషన్ నీటి ఆధారాల్లో అత్యధిక భాగాన్ని ఆక్రమించిన బోరు బావుల సంఖ్య ఏకంగా 12,64,598కి చేరుకోగా, వీటి తర్వాత ప్రధాన ఆధారంగా ఉన్న దిగుడు బావులు 4,81,610 నమోదయ్యాయి, కాగా ఉపరితల నీటి వనరులైన చెరువులు, కుంటలు కేవలం 94,370 మాత్రమే ఉన్నట్లు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

