కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీడ్ పత్తి (Seed Cotton) సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఈసారి సాధారణ పత్తి సాగు వైపే రైతులు మొగ్గు చూపారు. ముఖ్యంగా సీడ్ పత్తి సాగుకు అనుకూలమైన జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంతాల్లో ప్రత్యేకంగా విత్తనోత్పత్తికి రైతులు కొన్ని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 6.85 లక్షల నుంచి 7.05 లక్షల ఎకరాల్లో సాధారణ పత్తి సాగు జరిగింది. ఇందులో విత్తన కంపెనీల కోసం ప్రత్యేకంగా సాగు చేసే ‘సీడ్ పత్తి’ విస్తీర్ణం సుమారు 42 వేల ఎకరాల వరకు ఉన్నట్లు అధికారిక అంచనా.
అయితే ఈ ఏడాది కేవలం 13 వేల ఎకరాల్లోనే ‘సీడ్ పత్తి’ సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత కారణంగా సుమారు 40 శాతం పత్తి పంట దెబ్బతిన్నట్లు అధికారుల అంచనాలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎండిపోతున్నాయి. కనీసం పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపుగా పెరిగినా.. నీరు లేక!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్నిప్రాంతాల్లో నీరు అందక రైతులు ఏపుగా పెరిగిన పత్తి పంటను ట్రాక్టర్లతో దున్నించి తొలగించారు. జులై, ఆగస్టులో నెలల్లో ఆలంపూర్, ఉండవల్లి ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. ప్రాజెక్టుల కింద నీరు ఉన్నప్పటికీ కాల్వలకు విడుదల కాలేదని, కరెంట్ కోతలు ఇబ్బంది పెడుతున్నాయని రైతులు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈఏడాది సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ, ప్రతికూల వాతావరణంతో దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంది. దాదాపు సగం పంట నీటి ఎద్దడితో దెబ్బతింది.
నిబంధనలతో సాగుకు వెనుకంజ
జోగులాంబ గద్వాల జిల్లాలోని నడిగడ్డ ప్రాంతం విత్తనపత్తికి అనుకూలమైనది. రాష్ట్రవ్యాప్తంగా పత్తి సాగు పెరగడంతో పాటు, ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా నాగర్‌కర్నూల్ వంటి జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరిగినట్లు సమాచారం. కానీ సీడ్ పత్తి సాగు చేసే రైతులు ఆయా కంపెనీల నిబంధనలు, గిట్టుబాటు కాని ధరలతో ఈసారి వాతావరణ పరిస్థితులతో వెనకడుగు వేశారని.. మరికొందరు సాధారణ పత్తి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సీడ్ పత్తి సాగుకు జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంతం అనుకూలమైనప్పటికీ, కంపెనీల ఇష్టాను రీతిగా వ్యవహరించడంతో సీడ్ గ్రోవెర్స్ వెనుకడుగు వేశారు.
మరోవైపు సీడ్ పత్తి ఉత్పత్తిలో పువ్వుల్లోని కేసరాలను తీసివేసి పరపరాగ సంపర్కం చేయాలి. ఈ పనికి చాలా సన్నని, చిన్న వేళ్ళు , సున్నితమైన చేతులు అవసరం. చిన్న పిల్లలు (ముఖ్యంగా బాలికలు) ఈ పనిని చాలా వేగంగా, జాగ్రత్తగా చేయగలరని విత్తన ఉత్పత్తిదారులు భావిస్తారు. అయితే పత్తి పువ్వుల పరపరాగ సంపర్కం (క్రాసింగ్) పనులకు చిన్న పిల్లలు/బాలికలు అందుబాటులో లేకపోవడం, ఒకవేళ వారిని పనుల్లోకి తీసుకుంటే అధికారులు బాలకార్మిక చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నారని సీడ్ గోయర్స్ విత్తనపత్తి ఉత్పత్తికి వెనుకడుగు వేస్తున్నారు. అలాగే ఎల్ నినో ప్రభావం ఉంటుందని ముందే వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు సుముఖత చూపలేదని తెలుస్తోంది.
పాత విత్తన స్టాక్ క్లియర్
విత్తన పత్తి కంపెనీలు గతంలో ఉత్పత్తి చేసిన విత్తనాలను ఎలాగైనా అమ్ముకోవాలని ఉద్దేశంతో ఈసారి ఎక్కువగా రైతులకు ఫౌండేషన్ సీడ్ సరఫరా చేయలేదని తెలుస్తోంది. గతేడాది నడిగడ్డ ప్రాంతంలో 42 వేల ఎకరాల్లో సుమారు 21 కంపెనీల ఫౌండేషన్ సీడ్ ను ఉత్పత్తి చేసేందుకు రైతులు ముందుకొచ్చారు. ఈసారి 7 కంపెనీల మాత్రమే సరఫరా చేయగా, కేవలం 13 వేల ఎకరాల్లోనే ఉత్పత్తి చేసేందుకు రైతులు ఆసక్తి చూపారు. ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విత్తనోత్పత్తి సరిగా లేదని తెలుస్తోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో 2030 సంవత్సరం నుంచి జీటి-3(హెచ్ టీ) రకం పత్తి విత్తనం మార్కెట్లోకి వస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం వాటికి డిమాండ్ ఉండదనే కారణంగా కంపెనీలు నిల్వ ఉంచిన స్టాకును అమ్ముకోవడానికి ఈసారి అంతగా ఆసక్తి చూపలేదని సమాచారం. మొత్తంగా ఈసారి నడిగడ్డ ప్రాంతంలో సీడ్ పత్తి ఉత్పత్తి అంతగా జరగడం లేదు.

