కలం, తెలంగాణ బ్యూరో: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ (KCR Farmhouse Land) విస్తీర్ణమెంత? రికార్డుల మేరకే క్షేత్రస్థాయిలో భూమి ఉన్నదా? లేదంటే అంతకంటే ఎక్కువ ఉన్నదా? ఆ భూములు ఆయనకు ఎప్పుడొచ్చాయి? ఎవరి నుంచి వచ్చాయి?… ఈ లెక్కలన్నీ రెవెన్యూ డిపార్టుమెంట్ తేల్చనున్నది. మొట్టమొదటిసారి కేసీఆర్ ఫామ్‌హౌస్ లోపలికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఫామ్‌హౌస్‌లో క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి, ఆ భూములను కొలతలు వేసి.. రికార్డుల ప్రకారమే ఉన్నదా? లేక ఎక్కువ ఉన్నదా? అనేది నిర్ధారించనున్నది.
ఎర్రవల్లిలోని సర్వే నెంబర్ 325లో 388 ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌కు గాను 343 ఎకరాలే ఉన్నట్టు తేలడం, మరో 45 ఎకరాల మేర భూమి క్షేత్రస్థాయిలో లేకపోవడంతో.. అదే సర్వే నెంబర్‌ను ఆనుకొని ఉన్న కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములను కొలతలు వేయాలని రెవెన్యూ డిపార్టుమెంట్ ప్రాథమికంగా నిర్ణయించింది. మిస్ అయిన 45 ఎకరాల భూమిని గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో రెవెన్యూ రికార్డులు సమర్పించాలంటూ కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశమున్నది.
నోటీసుల తర్వాత సర్వే
కేసీఆర్ ఫామ్‌హౌస్ (KCR Farmhouse Land) ఎన్ని ఎకరాల్లో ఉంటుంది? ఏయే పంటలు సాగవుతాయి? సామాన్య జనం చూడడానికి అవకాశం ఉంటుందా?.. ఇలాంటి సందేహాలు సహజం. రెవెన్యూ సిబ్బందికి సైతం దాన్ని దగ్గర నుంచి చూసే అవకాశం ఇప్పటివరకూ వచ్చి ఉండకపోవచ్చు. తాజాగా సర్వే నెంబర్ 325 భూముల అంశంలో రెవెన్యూ డిపార్టుమెంట్ చేసిన సర్వే అనంతరం తయారైన రిపోర్టుపై ముఖ్యమంత్రి రివ్యూ సందర్భంగా పలు ఆసక్తికరమైన అంశాలను అధికారులు ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఫామ్‌హౌస్ వైపు కన్నెత్తి చూడని, దాని గురించి పట్టించుకోని రెవెన్యూ అధికారులు ఫస్ట్ టైమ్ లోపలికి ఎంట్రీ కానున్నారు.
ఫిజికల్‌గా భూములను కొలతలు వేయనున్నారు. మిస్ అయిన భూమి మిక్స్ అయిందేమో నిర్ధారించనున్నారు. కేసీఆర్‌కు, ఆయన ఫ్యామిలీ మెంబర్లకు నోటీసులు జారీ చేసిన అనంతరం తర్వాత ఫిజికల్ సర్వే షురూ కానున్నది. దీనికి కేసీఆర్ సహకరిస్తారా?.. కోర్టును ఆశ్రయిస్తారా? అనేది త్వరలో తేలనున్నది. మరోవైపు ఒకవేళ ఎర్రవల్లి భూముల వ్యవహారంపై కేసీఆర్ కోర్టును ఆశ్రయిస్తే, తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని సీనియర్ అడ్వొకేట్ అరుణ్ కుమార్ హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. దీంతో ఇది ఎలాంటి టర్న్ తీసుకోనున్నది? అనే ఉత్కంఠ నెలకొన్నది.
ఫామ్‌హౌస్ పక్కనే అసైన్డ్ ల్యాండ్స్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సెప్టెంబర్ 16న 22ఏ భూముల అంశంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఎర్రవల్లిలోని సర్వే నెంబర్ 325లో ఉన్న అసైన్డ్ భూముల లెక్క తేల్చాలని, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు వారం రోజుల పాటు సర్వే చేశారు. ఆ భూముల్లో సేద్యం చేస్తున్న రైతుల రికార్డులను పరిశీలించి, వారికి నోటీసులు ఇచ్చి అభిప్రాయాలు తీసుకున్నారు. డిజిటల్ సర్వే నిర్వహించి 388 ఎకరాలకు బదులు 343 ఎకరాలే ఉన్నదని, 45 ఎకరాలు మిస్ అయిందని తేల్చారు.
ఈ రిపోర్టును సీఎం రేవంత్‌కు అందజేయగా, మిస్ అయిన 45 ఎకరాల లెక్క తేల్చాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సర్వే నెంబర్ భూమి, కేసీఆర్ ఫామ్‌హౌస్ పక్కపక్కనే ఉండడంతో మిస్ అయిన 45 ఎకరాల్లో కొంత అందులో కలిసిందా? రికార్డుల ప్రకారమే ఫిజికల్‌గానూ భూములు ఉన్నాయా? తేడాలేమైనా ఉన్నాయా? అనేది రెవెన్యూ డిపార్టుమెంట్ తేల్చనున్నది. ఇందుకోసం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసి, భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించనున్నది. అనంతరం సర్వే నిర్వహించనున్నది.
రాజకీయంగా చర్చ
కేసీఆర్ ఫామ్‌హౌస్ సర్వే రాజకీయంగా సరికొత్త చర్చకు దారితీయనున్నది. ప్రజల ఓట్లను కల్వకుంట్ల ఫ్యామిలీ పచ్చనోట్లుగా మార్చుకున్నదని, పదేండ్లలో తెలంగాణను దోపిడీ చేసిందని, ఉద్యమం టైమ్‌లో లేని వందలాది ఎకరాలు ఇప్పుడెలా వచ్చాయని, రాష్ట్రానికి అప్పులు–ప్రజలకు తిప్పలు మిగిలాయని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లు ప్రజల మధ్య చర్చకు తావిచ్చాయి. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులను పట్టించుకోలేదని, ఉద్యోగాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశారని పలు సందర్భాల్లో సీఎం ఆరోపించారు.
దాదాపు 1,200 మంది చనిపోతే 578 మందినే గుర్తించారని, మిగిలినవారిపై ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీశారు. దీనికి తోడు తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో అమరవీరులను గుర్తించి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సమీపంలోనే ప్రత్యేక కాలనీ కట్టించాలని సీఎం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌ను చూసుకున్న ప్రతిసారీ ఎదురుగా ఉండే అమరవీరుల కాలనీని చూడాల్సిన పరిస్థితి గురించి స్థానికుల్లో ఇప్పటికే చర్చ మొదలైంది.

