కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు (AP BC Reservations) పునరుద్ధరించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. స్థానిక ఎన్నికలలో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల గరిష్ఠ పరిమితి దాటడానికి వీల్లేదని రాజ్యాంగ ధర్మాసనం ఇదివరకే స్పష్టం చేసిన విషయాన్ని న్యాయస్థానం గుర్తుచేసింది. గతంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో పరిశీలించి, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ డిస్మిస్ చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో పాటు 50 శాతం పరిమితి లోపే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

