కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కృష్ణా నది జలాల్లో (Krishna Water Dispute) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు తప్పుపడడమే ఇందుకు నిదర్శనం. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించి.. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నీటి వాటాలో ఎక్కువగా వాడుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తుందని మండిపడ్డారు.
దీంతో ప్రాజెక్టు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరోసారి భగ్గుమంది. కోర్టు స్టేలు, నిబంధనలు ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నీటిని తరలించుకుపోతుందనే ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు పెండింగ్ ప్రాజెక్టులు, పాలమూరు జలాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
కనీస స్థాయి కన్నా తక్కువ ఉన్నా నీటి తరలింపు ఆగలేదు
శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయి (854 అడుగులు) కంటే తక్కువగా ఉన్నప్పుడు నీటిని తరలించరాదని, విద్యుత్ ఉత్పత్తి చేయరాదని ట్రిబ్యునల్ నిబంధనలు, గతంలో న్యాయస్థానాల స్టే ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం 847.80 అడుగులు మాత్రమే నీరు నిల్వ ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం నీటిని తరలించేందుకే మొగ్గు చూపుతోంది.
దీంతో ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు ఆస్కారం కలిగినట్లు అయింది. అయినప్పటికీ, ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు, ఇతర మార్గాల ద్వారా నీటిని తరలిస్తుందని, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని తెలంగాణ ఆరోపిస్తోంది. తద్వారా పాలమూరు ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ మంత్రి, పాలమూరు నేత జూపల్లి కృష్ణారావు అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలో శ్రీశైలంలో 854 అడుగుల కంటే తక్కువ నీరు ఉన్నప్పుడు ఏపీ నీటిని వాడకుండా తాను స్వయంగా కోర్టు నుంచి ‘స్టే’ తెచ్చిన విషయాన్నిగుర్తు చేశారు. ఆ ఉత్తర్వులను ఏపీ తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు.
బ్యాక్ వాటర్ నుంచి తీసుకుంటే..
నల్లగొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని ఏదుల రిజర్వాయర్ నుంచి కాకుండా నేరుగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవాలని జూపల్లి ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇదే విషయాన్నిఆయన సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. బ్యాక్ వాటర్ నుంచి నీటిని తీసుకోవడం ద్వారా నల్లగొండ, పాలమూరు జిల్లాలకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలకు, మంత్రి జూపల్లి సూచనల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు.
ఈనెల 6న నీటి పారుదల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఒక్క చుక్కకూడా పోకుండా చూడాలని, ట్రిబ్యునల్స్‌లో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి జూపల్లి చెప్పిన బ్యాక్ వాటర్ సూచనపై సీఎం సానుకూలంగా సందించి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీకి చెక్ పెట్టాలంటే సాంకేతికంగా ప్రాజెక్టు డిజైన్ మార్పులు, న్యాయపరంగా సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.
కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయాలని..
ఈ వ్యవహారం కేవలం నీటి పంపకాలకే పరిమితం కాలేదు. బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ దీన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న స్నేహంతోనే రేవంత్ మౌనంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. శ్రీశైలం ఖాళీ అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తుందని, ఇది రైతుల పాలిట శాపంగా మారుతుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వెంటనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కి ఫిర్యాదు చేయడంతో పాటు, కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ (ధిక్కరణ దావా) వేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. పాలమూరు రైతుల ప్రయోజనాలు కాపాడలేకపోతే, సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి జూపల్లికి అది రాజకీయంగా ఇబ్బందికరమే వాదన జిల్లా ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

