కలం, తెలంగాణ బ్యూరో: చలికాలం వస్తుందనగానే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే గిన్నెధారి, తిర్యాణి, బేలా, అర్లి, థాంసి, జైనథ్ తదితర మండలాలు గుర్తుకొస్తాయి. రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొండలు గుర్తుకొస్తాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోతాయి. ఆదివాసీ ప్రజలు చలిమంటలు వేసుకోవడం, తెల్లవారుజామున రోడ్లపై మంచుతో డ్రైవర్ల కష్టాలు.. ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి అలాంటి పరిస్థితి మచ్చుకైనా కనిపించే అవకాశం లేదని ప్రపంచ, భారత వాతావరణ కేంద్రాలు పేర్కొన్నాయి.
ఎల్ నినో కారణం (El Nino Impact)గా శీతాకాలంలో కనిపించే చలి సంగతేమో గానీ.. సాధారణ కంటే గరిష్టంగా 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, దాదాపు వేసవి కాలం లాగే వేడి ఉంటుందని హెచ్చరించాయి. ఎల్ నినో కారణంగా ఈసారి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. వర్షాలు పడలేదు.. రిజర్వాయర్లు నిండలేదు. గ్రౌండ్ వాటర్ లెవల్ పెరగలేదు. దీనికి తోడు ఫ్యాన్లు, ఏసీలు ఇంకా వాడాల్సి వస్తున్నది. దీంతో సమ్మర్‌ను మించిన స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతున్నది.
భగభగలే..
ఎల్ నినో పుణ్యమా అని ఎలాగూ వర్షాకాలం పోయింది. కనీసం శీతాకాలం ఉంటుందనుకుంటే అదీ లేదు. వచ్చే నెలలో టెంపరేచర్ మరింత పెరుగుతుందని, అది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ కంటిన్యూ అవుతుందని, ఆ తర్వాత యథావిధిగా వేసవి వచ్చేస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే వేసవి తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వచ్చే ఏడాది రెగ్యులర్‌గా వచ్చే వేసవి కాలం కలిపి ఈసారి ‘డబుల్ సమ్మర్’ తప్పదని హెచ్చరించింది.
సాధారణంగా చలి కాలంలోని టెంపరేచర్‌లతో పోలిస్తే ఈసారి కనీసంగా 5 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ఎల్ నినో పరిస్థితులు మరింత తీవ్రమై నవంబర్ చివరికి దక్షిణ భారత్, తెలంగాణ వాతావరణంపై గణనీయమైన ప్రభావాన్నే చూపుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఉండాల్సిన ఈశాన్య (నార్త్ ఈస్ట్) రుతుపవనాలు, శీతాకాల పరిస్థితులు, అక్టోబర్–డిసెంబర్ తుఫాన్ల సీజన్ ఎఫెక్టులను ఎల్ నినో తుడిచేస్తుందని, దీని ప్రభావమే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇది అసాధారణం..
ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో అసాధారణమైనదని పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం)కి చెందిన వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ పేర్కొన్నారు. దీని ప్రభావం చాలా బలంగా ఉన్నదని, నవంబర్‌లో గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ‘‘మధ్య పసిఫిక్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఇప్పటికే దాదాపు 3 డిగ్రీల వరకు అధికంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎల్ నినో ప్రభావం వచ్చే ఏడాది ఏప్రిల్–మే వరకు కొనసాగి ఆ తర్వాత బలహీనపడే అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు సముద్రంలో నిల్వగా పేరుకుపోయిన అదనపు వేడి ఆ తర్వాత కూడా కొన్ని నెలల పాటు మొత్తం ప్రపంచ వాతావరణంపైనే ప్రభావం చూపవచ్చు. భారత్‌లోని 150 ఏళ్లకు పైగా ఉన్న రుతుపవన రికార్డులను పరిశీలిస్తే.. ఎల్‌నినో ఏర్పడిన సంవత్సరాల్లో దాదాపు సగం సంవత్సరాల్లో కరువు పరిస్థితులే నెలకొన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావాలు మరింత తీవ్రంగా ఉంటాయి” అని వివరించారు.

