కలం, తెలంగాణ బ్యూరో: ఎల్ నినో కారణంగా (El Nino Impact) రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. ఒకవైపు రోజువారీ విద్యుత్ డిమాండ్ (Power Demand) సమ్మర్ రికార్డులను దాటేస్తున్నది. మరోవైపు చేతికొస్తున్న పంటలకు సాగునీరు లేక వ్యవసాయ పంపుసెట్ల వినియోగం బాగా పెరిగింది. కొన్ని చోట్ల సింగిల్ ఫేజ్ సప్లై, మరికొన్ని చోట్ల లో-వోల్టేజీతో మోటార్లు కాలిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరగడంతో దాని సబ్సిడీ భారం (Subsidy Burden) ప్రభుత్వ ఖజానాపై పడింది. ఇంకోవైపు 200 యూనిట్ల గృహజ్యోతి స్కీమ్ ద్వారా చెల్లించాల్సిన సబ్సిడీని కూడా ఈ ఏడాదే చెల్లించాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. మరోవైపు, గత ప్రభుత్వ అప్పుల భారం, ప్రస్తుతం చేస్తున్న కొత్త అప్పులు, సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు, వివిధ స్కీమ్ల కింద ఇస్తున్న సబ్సిడీ.. ఇవన్నీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
రికార్డు స్థాయి వాడకం
ఎల్ నినో కారణంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశించినంతగా పెరగకపోవడం, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడం, మోటారు పంపుసెట్లను ఎక్కువసేపు నడపాల్సి రావడంతో విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. రైతులకు సాగునీరు ఇచ్చినా ఇవ్వకున్నా.. ప్రభుత్వానికి మాత్రం వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ భారం పెరుగుతున్నది. ఇప్పటికే వివిధ రూపాల్లో డిస్కంలకు ప్రభుత్వం బకాయి పడి ఉన్నందున అవి అప్పుల ఊబిలో, నష్టాల్లో కూరుకుపోతున్నాయని మొత్తుకుంటున్నాయి.
ఎలక్ట్రిసిటీ కమిషన్ కూడా అదే చెప్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ భారం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరమే తీర్చాల్సి వస్తున్నదన్నారు. రాష్ట్రంలో వినియోగిస్తున్న మొత్తం విద్యుత్లో దాదాపు 28% వ్యవసాయ పంపుసెట్లకు వాడుకుంటున్నారని తెలిపారు. అసలే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం ఈ బకాయిలను అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరమే చెల్లిస్తుందా?.. లేదా?.. అనే అనుమానం అధికారులను మరింత ఇబ్బంది పెడుతున్నది.
త్వరలో కొలిక్కి లెక్కలు..
నిర్దిష్టంగా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ భారం ప్రభుత్వంపై ఏ మేరకు పడుతుందనేది త్వరలో కొలిక్కి వస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ఎప్పటికప్పుడు ఈ లెక్కలు మారుతూ ఉంటాయని, ఖరీఫ్ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత క్లారిటీ వస్తుందన్నారు. నైరుతి రుతుపవనాలు, ఎల్ నినో ఎఫెక్ట్ (El Nino Impact), వ్యవసాయానికి వాడిన విద్యుత్.. వీటన్నింటిపై ఒక డెడ్లైన్ పెట్టుకుని డిస్కంలపై ఏ మేరకు భారం పడిందో, ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో ఎంత రావాల్సి ఉంటుందో స్పష్టత వస్తుందన్నారు.
ఈసారి గృహజ్యోతి విద్యుత్ వాడకం కూడా పెరుగుతుందని, 200 యూనిట్లు దాటే సంగతి ఎలా ఉన్నా కొత్త వినియోగదారులు కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉందని, ఈ స్కీమ్ సబ్సిడీ భారం కూడా ప్రభుత్వంపై పడనున్నదని తెలిపారు. ప్రస్తుతానికి ఈ రెండింటి ద్వారా ప్రభుత్వానికి సుమారు రెండు వేల కోట్ల రూపాయల మేర భారం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.

