epaper
Friday, January 16, 2026
spot_img
epaper

మూడు ఫేజ్‌లలో పంచాయతీ ఎలక్షన్స్

కలం డెస్క్ : గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల(Panchayat Elections) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వార్డులు, పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల రిజర్వేషన్ కోసం విధివిధానాలను ప్రభుత్వం జారీచేసింది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా కలెక్టర్ మొదలు ఎంపీడీవో వరకు రిజర్వేషన్‌లను ఖరారు చేసే ప్రక్రియ మొదలైంది. మరోవైపు వార్డులవారీగా ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు చేర్పుల ప్రక్రియ రేపటితో (నవంబరు 23) ముగుస్తున్నది. ఇంకోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌పై హైకోర్టులో జరుగుతున్న విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున కౌంటర్ అఫిడవిట్‌ను ఈ నెల 24న దాఖలు కానున్నది. ఆ మరుసటి రోజునే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నది. దానికి అనుగుణంగా అదే రోజు (నవంబరు 25) లేదా మరుసటి రోజున రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ఖరారు చేయనున్నది.

పోలింగ్ ఏర్పాట్లు కొలిక్కి :

స్థానిక సంస్థల్లో తొలుత గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నెల 25 లేదా 26న షెడ్యూలు ఖరారు కాగానే ఆయా జిల్లాల్లో ఎన్నికల అధికారులు నోటీసులు జారీచేసి నామినేషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు తదితర వివిధ విభాగాల అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే లోతుగా సమీక్షించి ఏర్పాట్లు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలట్ బాక్సుల అవసరం, బ్యాలట్ పేపర్ ముద్రణ, ఎన్నికల సిబ్బందికి విధుల కేటాయింపు, పోలీసు భద్రత తదితరాలన్నింటిపై కసరత్తు కొలిక్కి వచ్చింది.

మూడు దశల్లో పోలింగ్ :

గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను(Panchayat Elections) మూడు దశల్లో నిర్వహించాలనుకుంటున్నది. ఆ ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా షెడ్యూలు రూపొందించింది. డిసెంబరు 17వ తేదీలోగా పోలింగ్, ఫలితాల వెల్లడి ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబరు 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశమున్నది. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో రాజకీయ నేతలు కూడా పకడ్బంధీ ప్రచారానికి వ్యూహాలు పన్నుతున్నారు. మద్దతు ఇచ్చే అభ్యర్థుల గెలుపు బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అప్పజెప్పింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మాత్రం ఫిబ్రవరి తర్వాత నిర్వహించే అవకాశమున్నది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించే షెడ్యూలుతో స్థానిక ఎన్నికల వేడి ఊపందుకోనున్నది.

Read Also: ఎస్టీలకు రిజర్వేషన్ గైడ్‌లైన్స్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>