కలం, వెబ్‌డెస్క్ : దేశ ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బంగ్లాదేశ్ విదేశాంగ విధానం ఉంటుందని ఆ దేశానికి కాబోయే ప్రధాన మంత్రి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(BNP) అధినేత తారిఖ్ రహ్మాన్ స్పష్టం చేశారు (Tarique Rahman). బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 297 స్థానాలకు బీఎన్పీ 212 సీట్లను గెలుచుకుంది. పార్టీ ఏకపక్ష విజయం అనంతరం శనివారం తారిఖ్ రహ్మాన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌తో సహా పొరుగు దేశాలతో సంబంధాలపై తమ వైఖరిని వెల్లడించారు.
బంగ్లాదేశ్‌కు కాబోయే ప్రధానిగా త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న ఆయన.. ప్రాంతీయ శక్తులైన భారత్, చైనా, పాకిస్థాన్‌తో దేశ సంబంధాలపై స్పందించారు. ‘బంగ్లాదేశ్ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా దేశ విదేశాంగ విధానం ఉంటుంది. పొరుగు దేశాలతో సంబంధాలు ఉంటాయి’ అని తారిఖ్ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ఇటీవలే దివంగతరాలైన ఖలీదా జియా కుమారుడైన తారిఖ్.. దాదాపు 17 ఏళ్ల అనంతరం స్వదేశంలో అడుగుపెట్టారు. ఏడాదిన్నర కిందట విద్యార్థుల ఆందోళనలతో అప్పటి ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) పదవిని, దేశాన్ని వదిలేసి భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మహ్మద్ యూనస్ (Muhammad Yunus) సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట తిరిగి బంగ్లాదేశ్‌కు వచ్చిన తారిఖ్.. ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించడంతో త్వరలో ప్రధాని పీఠం ఎక్కనున్నారు.
ప్రధాని మోదీకి ఆహ్వానం!
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రహ్మాన్ (Tarique Rahman) ప్రమాణ స్వీకారానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందించాలని బీఎన్పీ భావిస్తున్నట్ల సమాచారం. భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల ప్రధానులు, అధ్యక్షులను ఆహ్వానించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్న తెలుస్తోంది. కాగా, భారత వ్యతిరేక అల్లర్లతో ఏడాదిన్నరగా అట్టుడికిన బంగ్లాదేశ్‌లో హిందువులపై అనేక దాడులు, హత్యలు జరిగాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌కు వెళతారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే, ఇప్పటికే బీఎన్పీ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ తారిఖ్ రహ్మాన్‌కు ప్రధాని మోదీ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరైతే భారత్, బంగ్లాదేశ్ (Bangladesh)లో సంబంధాల్లో కొత్త మార్పలకు శ్రీకారం చుట్టే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: సరికొత్తగా ‘ఆధార్’.. కీలక మార్పులు
Follow Us On : WhatsApp


