epaper
Tuesday, November 18, 2025
epaper

మావోయిస్టులకు ‘బండి’ డెడ్‌లైన్

కలం డెస్క్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పెట్టిన గడువు వచ్చే ఏడాది మార్చి 31తో ముగుస్తుందని, మిగిలింది నాలుగు నెలలేనని, అప్పటిలోగా మావోయిస్టులంతా లొంగిపోవాల్సిందేనని ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. ఆయుధాలు ఉండాల్సింది పోలీసులు, సైనికుల చేతుల్లోనే అని, మావోయిస్టుల చేతుల్లో కాదన్నారు. నక్సల్స్ చేతుల్లో ఆయుధాలు ఉన్నంతకాలం వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తుపాకులతో పోలీసులను, అమాయక ప్రజలను చంపితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. బుల్లెట్ ద్వారా రాజ్యాధికారాన్ని సాధించడం సాధ్యం కాదని, బ్యాలెట్‌ను నమ్ముకుని తాము అధికారంలోకి వచ్చామన్నారు. బుల్లెట్‌తో నక్సలైట్లు సాధించేదేమీ ఉండదన్నారు. అనుకున్నట్లుగానే వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని, ఇప్పటికైనా తుపాకులను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. వేములవాడలో ఏరియా ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమం అనంతరం మీడియాతో పై కామెంట్లు చేశారు.

అర్బన్ నక్సల్స్ మాయలో పడి అమాయక నక్సల్స్ అడవుల్లో తుపాకీ కాల్పులకు బలవుతున్నారని బండి సంజయ్ అన్నారు. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో ఉంటూ జల్సాలు చేస్తున్నారని, ఏసీ గదుల్లో ఉంటున్నారని, కార్లలో తిరుగుతున్నారని, ఆస్తులను పోగేసుకుంటున్నారని, అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగుతూ పైరవీలు చేసుకుంటున్నారని అన్నారు. కానీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్న నక్సలైట్లు మాత్రం కష్టాలను అనుభవిస్తున్నారని, ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. నక్సలైట్ల సిద్ధాంతాన్ని ప్రజలు విశ్వసించడం లేదని, అందుకే అగ్రనేతలు సైతం చాలా కాలం తర్వాత రియలైజ్ అయ్యి ప్రభుత్వానికి లొంగిపోతున్నారని అన్నారు. నక్సలైట్లు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, మావోయిస్టు పార్టీని ప్రభుత్వం నిషేధించిందని, నక్సలైట్లకు సహకరించి మద్దతు ఇచ్చేవారు కూడా నేరస్తులేనని అన్నారు.

తుపాకీ పట్టుకుని చర్చలకు పట్టుబడితే ఫలితం ఏమీ ఉండదని, ప్రభుత్వం ఆ షరతుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్ నొక్కిచెప్పారు. ‘మావోయిస్టులు తుపాకీ వీడాల్సిందే… జన జీవన స్రవంతిలో కలవాల్సిందే… తుపాకీ వీడి జనంలోకి వచ్చేవారికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది… బుల్లెట్‌ను నమ్ముకుంటే ప్రాణాలు తీసుకోవడం మినహా వారు సాధించేదేమీ లేదు… బ్యాలెట్‌ను నమ్ముకుంటే అధికారంలోకి రావచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి..’ అని బండి సంజయ్(Bandi Sanjay) కామెంట్ చేశారు.

Read Also: ఏపీ పోలీసుల అదుపులో దేవ్‌జీ?

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>