ప్రముఖ దక్షిణాది సినీ హీరోలు రజనీకాంత్(Rajinikanth), నందమూరి బాలకృష్ణ(Balakrishna) లకి అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరిగే 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2025) వేదికగా వీరికి సన్మానం జరగనున్నది. భారతీయ సినీ పరిశ్రమలో 50 ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా వీరికి ఈ గౌరవం దక్కనున్నది. ఈ ఇద్దరు నటులను ప్రభుత్వం తరఫున సన్మానించనున్నట్టు సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ వెల్లడించారు.
గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో కలిసి మంత్రి మురుగన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘రజనీకాంత్, బాలకృష్ణ 50 ఏళ్ల సినీ జర్నీ పూర్తి చేయడం భారత సినీ చరిత్రలో ఒక మైలురాయి. నటనలో ప్రత్యేక శైలి, ప్రజాదరణలో పొందడం వీరి కెరీర్‌కు నిదర్శనాలు. ప్రేక్షకుల నుండి వచ్చిన ప్రేమకు, పరిశ్రమకు అందించిన కృషికి ఇది జాతీయ స్థాయి గుర్తింపు” అని వారు పేర్కొన్నారు.
కాగా, నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో ఈ వేడుకలు(IFFI 2025) జరగబోతున్నాయి. దేశ, విదేశాల నుంచి సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. 1975లో ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో రజనీకాంత్ కెరీర్ ప్రారంభించారు. తన స్టైల్, నటన, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించారు. ఆధ్యాత్మికత, సాదాసీదా జీవన విధానాన్ని పాటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.
1974 తాతమ్మ కల సినిమాతో సినీ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ కూడా 50 ఏళ్లకుపైగా సినిమాల్లో కొనసాగుతున్నారు. యాక్షన్, డ్రామా, బయోపిక్స్ ఏ జానర్‌లోనైనా తనదైన శైలిలో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. నటనతోపాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సామాజిక సేవ కూడా చేస్తున్నారు. రాజకీయాల్లోనూ ఆయన రాణించారు. ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక ఆయన నటిస్తున్న ‘అఖండ 2’ విడుదలకు సిద్ధంగా ఉంది.
Read Also: జక్కన్నకి జలకిచ్చిన ‘వానరసేన’
Follow Us on : Pinterest

