కలం, వెబ్ డెస్క్: సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) నేడు మంత్రులు, సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పలు విభాగాల్లో పనుల విషయంలో క్షేత్ర స్థాయిలో ఉదాసీనంగా ఉందన్నారు. ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. అద్భుతంగా చేశామంటున్నా క్షేత్రస్థాయిలో మరోలా ఉందన్నారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఫలితం కనిపించాలని పవన్ సూచించారు. పథకాలు అమలు చేయడంలో ఎలాంటి మినహాయింపులు లేవన్నారు. పాలసీల్లో ఉన్నవి, చెప్పినవి అన్నీ చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో గ్యాప్స్ లేకుండా చూసుకోవాలన్నారు.
ఇక తన డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి పల్లె పండుగ కార్యక్రమానికి గత సంవత్సరం రూ.2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద రూ.5,700 కోట్లు కేటాయించినట్లు పవన్ చెప్పారు. అడవి తల్లి బాటకు రూ.1,500 కోట్లతో మొత్తంగా రూ.11,328 కోట్లు సాంక్షన్ చేసినట్లు తెలిపారు. జల జీవన్ మిషన్ పథకానికి రూ.28,000 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే రూ.10,000 కోట్లకు సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. అటవీ శాఖలో రూ.200 కోట్లు నగర వనాలకు కేటాయించామన్నారు. ఆర్థిక పరిమితులు దాటుకొని ప్రభుత్వం ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకొని అభివృద్ధి చేస్తోందన్నారు. అతి కష్టం మీద పనులకు నిధులు సమకూరుతున్నాయని, అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు.


