కలం, తెలంగాణ బ్యూరో : మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికలను (Municipal Elections) మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతుండడంతో గెలుపు కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. మరే పార్టీకంటే ముందుగానే ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్ ఏటికి ఎదురీదుతున్నది. ఈ ఎన్నికల్లో వెలువడే ఫలితాలు కేటీఆర్ (KTR) వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా మారింది. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం. మరోవైపు రెండు టర్ముల్లో పురపాలక శాఖ మంత్రిగా ఆయన పనితీరుకు ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా తీర్పు చెప్పనున్నారు. అందుకే వ్యక్తిగతంగా కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌కు ఇది ‘ఇజ్జత్ కా సవాల్’గా మారింది. ఎన్ని మున్సిపల్ చైర్‌పర్సన్, మేయర్ స్థానాలను గెల్చుకుంటారన్నది ప్రతిష్టాత్మకమైంది.
సీఎం రేవంత్ బాటలో కేటీఆర్ :
ఎలక్షన్ షెడ్యూలు రాకముందే కేటీఆర్ (KTR) జిల్లాలవారీగా పార్టీ లీడర్లు, కేడర్‌తో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. వార్డు స్థాయిలో మీటింగులు పెట్టాలని, కేడర్‌ను ఉత్సాహపర్చాలని షెడ్యూలు రూపొందించారు. కానీ ఫోన్ ట్యాపింగ్ ఎంక్వయిరీ ఆ పార్టీ నేతలను వెంటాడడంతో మున్సిపల్ ఎలక్షన్స్ ఇష్యూ నుంచి డైవర్ట్ కాక తప్పలేదు. సీఎం విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత తనదైన శైలిలో బీఆర్ఎస్‌ను ఉచ్చులోకి లాగారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అంశాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్‌పై ‘జాతిపిత’ సెటైర్లు వేయడంతో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా కౌంటర్లు ఇవ్వడంలో మునిగిపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనలు చేస్తూ మున్సిపల్ ఎన్నికల బహిరంగసభల్లో పాల్గొంటుండడంతో కేటీఆర్ సైతం సిరిసిల్ల జిల్లాను వదిలి ఇతర జిల్లాల్లో తిరగక తప్పడంలేదు. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ (KCR) ఫామ్ హౌజ్‌కు పరిమితం కావడంతో కేటీఆర్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకోక తప్పలేదు.
జీహెచ్ఎంసీ రిజల్టుతో తుది అంకానికి :
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన 39 స్థానాల్లో 16 జీహెచ్ఎంసీ పరిధిలోనివే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్‌కు (BRS) తిరుగులేదని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ ప్రచారం చేసిన చోట బీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించిందంటూ ఆయన గురించి గులాబీ నేతలు గర్వంగా చెప్పుకున్నారు. ఆయన్ను హీరోగా కొనియాడారు. కానీ ఆ తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల ఉప ఎన్నికలను (సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్) కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా ఓడిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఫలితాలు తేడాగా రావొచ్చనే అనుమానం వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితుల్లో త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలు కేటీఆర్‌కు కీలకం. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన నాయకత్వానికి పరీక్ష. రెండు ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో గెలవలేకపోయామనే అపవాదు ఆయన రాజకీయ భవిష్యత్‌ను డిసైడ్ చేయనున్నది.
Read Also: జూన్ 2న కవిత సంచలన ప్రకటన
Follow Us On: X(Twitter)


