epaper
Wednesday, February 18, 2026
epaper

జూన్ 2న కవిత సంచలన ప్రకటన

కలం, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) కొత్త రాజకీయ పార్టీ (Political Party) ఏర్పాటుపై కసరత్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళిన తెలంగాణ జాగృతి టీమ్‌ కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) అధికారులతో భేటీ అయింది. కొత్త పార్టీ పెట్టడానికి అవసరమైన అప్లికేషన్‌ను, ఇతర డాక్యుమెంట్లను సమర్పించింది. మూడు, నాలుగు నెలల్లో కొత్త పార్టీ కసరత్తు కొలిక్కి రానున్నది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న లాంఛనంగా ఆమె పార్టీ పేరును, జెండాను, ఎజెండాను ప్రకటించనున్నారు. అమరవీరుల కుటుంబాల సాక్షిగా తన రాజకీయ భవిష్యత్తును స్పష్టం చేయనున్నారు. పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందో కూడా అదే రోజున ప్రకటించనున్నారు. ఈ లోగా నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక సన్నాహకాలను పూర్తి చేయనున్నారు.

పార్టీ పేరులో తెలంగాణ పదం సెంటిమెంట్‌ :

సామాజిక తెలంగాణ నినాదాన్ని వల్లిస్తున్న కవిత… తన పార్టీ పేరులో తప్పనిసరిగా ‘తెలంగాణ’ (Telangana) అనే పదాన్ని ఉండేలా చూసుకున్నారు. పార్టీ స్థాపన కోసం ఈసీకి సమర్పించిన దరఖాస్తులో నాలుగు పేర్లను సూచించినట్లు జాగృతి వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఆ నాల్గింటిలోనూ తెలంగాణ పదం ఉన్నట్లు గుర్తుచేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2వ తేదీని ఎంచుకోడానికి కూడా నిర్దిష్ట కారణం అదేనని నొక్కిచెప్పాయి. టీఆర్ఎస్ (TRS) పార్టీ పేరులో ‘తెలంగాణ’ పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి (BRS)గా మారిన తర్వాత ఆ పార్టీని ప్రజలు దూరం పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను కూడా వ్యతిరేకించినట్లు స్వయంగా కవితే పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌కు అనుగుణంగా పార్టీ పేరులో తెలంగాణ అనే పదాన్ని ఆమె పెట్టుకున్నారు.

గన్‌పార్కులో అమరవీరులకు నివాళి :

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు 1200 మంది త్యాగం చేశారని బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) అనేక సందర్భాల్లో చెప్పింది. దాదాపు 500 కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయం అందింది. సరిగ్గా ఈ విషయాన్నే కవిత ఇటీవల కొన్నిసార్లు ప్రస్తావించారు. మొత్తం 1200 అమరవీరుల కుటుంబాలున్నట్లు ప్రభుత్వం గుర్తించినా కొన్ని ఫ్యామిలీస్‌కు మాత్రమే ప్రభుత్వ సాయాన్ని అందించి మిగిలిన కుటుంబాలను పట్టించుకోలేదని కేసీఆర్‌పై, బీఆర్ఎస్ విధానంపై ఆమె విమర్శలు చేశారు. రాష్ట్రం ఏర్పడి పన్నెండేండ్లయినా ఆ కుటుంబాలకు సంపూర్ణ న్యాయం దక్కలేదని వ్యాఖ్యానించారు. వీటన్నింటి నేపథ్యంలో పార్టీ ఏర్పాటుపై అఫీషియల్‌గా ప్రకటన చేసే రోజున తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కుకు వెళ్ళి అమరవీరులకు నివాళులర్పించి ఆ తర్వాత కొన్ని అమరవీరుల కుటుంబాల సమక్షంలో తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) కేంద్ర కార్యాలయంలో స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.

ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం ‘తెలంగాణ’ :

రాష్ట్రం కోసం కొట్లాడిన సబ్బండ వర్ణాల సమిష్టి కృషి, వందలాది మంది త్యాగఫలితమే స్వరాష్ట్ర ఏర్పాటు అని అన్ని పార్టీల నేతలు పదేపదే చెప్పే మాటలు. ఉద్యమం సమయంలో ‘జై తెలంగాణ’ అనేది ఒక బలమైన స్లోగన్ మాత్రమే కాక అది యావన్మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షగా రిఫ్లెక్ట్ అయింది. ఆ నినాదానికి ఉన్న శక్తి, పార్టీ పేరులో ఉన్న తెలంగాణ పదమే బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిందనేది కూడా ఆ పార్టీ నేతల అభిప్రాయం. రెండోసారి పవర్‌లోకి వచ్చిన తర్వాత పార్టీలో మారిన పరిస్థితులు, కొద్దిమందిలోని అతి విశ్వాసమే చివరకు తెలంగాణ పదాన్ని తొలగించడానికి, పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చడానికి దారితీసిందనేది కూడా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమైన బలమైన అభిప్రాయం. దీన్ని గమనంలోకి తీసుకున్న కవిత (Kavitha) పార్టీ పేరులో తప్పనిసరిగా ‘తెలంగాణ’ పదం ఉండేలా జాగ్రత్త తీసుకుని ప్రజలకు దగ్గరయ్యే సెంటిమెంట్ అస్త్రాన్ని ఎంచుకున్నారు. ‘తెలంగాణ’ పదం పార్టీకి ‘ఆత్మ’ లాంటిదని జాగృతి నేతలు వ్యాఖ్యానించారు.

Read Also: మరోసారి సిట్ ముందుకు కేటీఆర్, హరీశ్ ?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>