కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ (BRS) పార్టీకి బ్యాడ్ టైమ్ మొదలైనట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని.. ఆ వ్యతిరేకత తమకే అనుకూలంగా మారుతుందని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పెద్దగా సానుకూలత వ్యక్తమవ్వడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమైపోయారు. జనంలోకి రావడం లేదు. విచారణలు, ఎంక్వైరీల కోసం, అసెంబ్లీ సమావేశాల్లో మొక్కుబడిగా పాల్గొనేందుకు తప్ప ఆయన పెద్దగా బయటకు రావడం లేదు. మరోవైపు కేసీఆర్ కూతురు కవిత వేరు కుంపటి పెట్టి సొంత పార్టీని.. ఆ పార్టీ చేసిన తప్పుడు పనులను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. పార్టీ క్యాడర్లో పెద్దగా జోష్ కనిపించడం లేదు. పైగా ఎక్కడికక్కడ ప్రజల నుంచి నిరసన ఎదురవుతున్నది.
ముఖ్య నేతలకే ఎదురుదెబ్బ
పార్టీ అధినేత కేసీఆర్ (KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నియోజకవర్గాల్లోనే తిరుగుబాటు మొదలైంది. శుక్రవారం సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించారు. అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. పెద్దూరులోని బాబాజీ కాలనీకి కేటీఆర్ వెళ్లగా, స్థానికులు అడ్డుకుని నిలదీశారు. తమ వార్డుకు బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు. కనీస వసతులు కూడా కల్పించలేదని నిలదీశారు. మెడికల్ కాలేజీకి భూములిచ్చిన నిర్వాసితులు సైతం తమ గోడు వెళ్లబోసుకున్నారు. తక్షణం న్యాయం చేయాలని కోరారు. మరోవైపు అధినేత కేసీఆర్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల (Gajwel Municipal Elections) ప్రచారంలో బీఆర్ఎస్ నేతలను మల్లన్నసాగర్ ముంపు బాధితులు అడ్డుకున్నారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని 11 వార్డు బంజేరుపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారానికి వెళ్లిన గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డిని చుట్టుముట్టారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌తో ఊర్లు, భూములు లేకుండా చేసి తమను నిండా ముంచారని ఆరోపించారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వచ్చారంటూ నిలదీశారు. తమ ఉసురుతగిలే బీఆర్ఎస్ ఓడిపోయిందని శాపనాన్థాలు పెట్టారు.
మిగిలిన చోట్ల పరిస్థితి ఏమిటి?
కేసీఆర్, కేటీఆర్ నియోజకవర్గాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటన్న చర్చ సాగుతోంది. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ (BRS) పార్టీలో పెద్దగా లీడర్లు ఎవరూ యాక్టివ్ గా లేరు. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజాక్షేత్రంలో లేరన్న విమర్శలు ఉన్నాయి. మరి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత మేర ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ముఖ్యమంత్రి, మంత్రులు, కీలక నేతలు కాలికిబలపం కట్టుకొని తిరుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం మున్సిపాలిటీలు గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, బీజేపీని ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
Read Also: మున్సి‘పోల్స్‘లో ప్రలోభాల పర్వం.. బియ్యం, కుక్కర్లు, చీరల పంపిణీ
Follow Us On : WhatsApp


