కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రచార పర్వం ఊపందుకోవడంతో ఎవరికి వారు ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం మరో ఎత్తుకు చేరింది. పోలింగ్‌కు ఇంకా ఐదు రోజుల సమయం ఉండగానే ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ప్రధాన పార్టీలు ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు కాసులు కుమ్మరిస్తున్నారు. ప్రధానంగా పోటీ ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీల్లో ఈ పరిస్థితి సాధారణ ఎన్నికల పోరును తలపిస్తోంది. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో ప్రలోభాల పర్వం ఎక్కువగా ఉంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ల (Voters)కు కానుకలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. యాదగిరిగుట్ట, ఆలేరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లోని కొన్ని వార్డుల్లో 25 కేజీల బాస్మతి బియ్యం బ్యాగులు, 10 లీటర్ల మంచినూనె పంపిణీ చేశారు. మరికొన్ని వార్డుల్లో ఇంటింటికీ కుక్కర్లు పంపిణీ చేశారు. పోచంపల్లి మున్సిపాలిటీలోని ఓ వార్డులో మద్యం సీసాలు పంచారు. ఇక చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఓ వార్డులో పోటీ రసవత్తరంగా ఉండటంతో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బీ-ఫామ్ ప్రక్రియ పూర్తయిన నాటి నుంచే చీరలు, కుక్కర్లు అంటూ కానుకలు పంచే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.
యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) మధ్య పోటీ రసవత్తరంగా మారింది. దీంతో అభ్యర్థులు ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా తలపడుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కో కౌన్సిలర్ అభ్యర్థి టికెట్ దక్కించుకోవడం దగ్గరి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రూ. 50 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు ఇంకాస్త ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. దీనికితోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం మరింత హీటెక్కింది. ఈ క్రమంలో ఒక్కో ఓటుకు రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చు చేసేందుకు అభ్యర్థులు సిద్ధపడ్డారు. ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరకముందే పరిస్థితి ఇలా ఉంటే, పోలింగ్ నాటికి నోట్ల కట్టల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.


