కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్(Nizamabad)లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల నేతలు అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. ఇందూరు నగరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కంఠేశ్వర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్‌లో గురువారం ఉదయం మార్నింగ్ వాకర్స్‌ను కలుసుకుంటూ బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ(Dhanpal Suryanarayana), ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇంచార్జ్ ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ వాకింగ్ చేస్తూ, క్రికెట్ ఆడుతూ సరదాగా సీనియర్ సిటిజన్స్‌తో కూర్చొని ముచ్చటించారు.
ఈ ప్రచారంలో 19వ డివిజన్ అభ్యర్థి నాగోల్ల లక్ష్మి నారాయణ, 20వ డివిజన్ అభ్యర్థి న్యాలం రాజు, 35వ డివిజన్ ఎర్రం సుధీర్, 39వ డివిజన్ అభ్యర్థి జ్యోతి, 40వ డివిజన్ అభ్యర్థి సంజీవ్, 41వ డివిజన్ అభ్యర్థి బూరుగుల వినోద్, 42వ డివిజన్ అభ్యర్థి బెల్లల్ శశాంక్, 43వ డివిజన్ అభ్యర్థి సోమలింగం బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ఆర్థిక భద్రతపై ఎంత శ్రద్ధ వహిస్తారో, అదే స్థాయిలో దేశ ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో దేశ ప్రజలకు ధైర్యాన్ని నింపి, సమర్థవంతంగా మహమ్మారిని ఎదుర్కొన్న ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసమే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు, మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో(Municipal Elections) బీజేపీ అధికారంలోకి వస్తే, పాలిటెక్నిక్ కళాశాల చుట్టూ వాకర్స్ కోసం ప్రత్యేక వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గతంలో ఇచ్చిన హామీని మరోసారి గుర్తు చేశారు. ప్రతిరోజూ వందలాది మంది నగరవాసులు ఆరోగ్య పరిరక్షణ కోసం ఇక్కడ వాకింగ్‌కు వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. “ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలమని పెద్దలు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ, ప్రజల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Corporation) పరిధిలో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించి మన ఇందూరును మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఎమ్మెల్యే (Dhanpal Suryanarayana) నగరవాసులను కోరారు.
Read Also: పీఎం స్పీచ్ లేకుండానే లోక్‌సభ ఆమోదం
Follow Us On : WhatsApp


