epaper
Wednesday, February 18, 2026
epaper

పీఎం స్పీచ్ లేకుండానే లోక్‌సభ ఆమోదం

కలం, తెలంగాణ బ్యూరో : పార్లమెంటు చరిత్రలో అరుదైన ఘటన గురువారం చోటుచేసుకున్నది. వార్షిక బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం, సమాధానం లేకుండానే లోక్‌సభ (Lok Sabha)లో  ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా (Om Birla) ప్రకటించారు. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైమ్. యూపీఏ హయాంలో (2004 జూన్ 10న) అప్పటి ప్రధానిగా ఉన్న మన్‌మోహన్‌సింగ్ ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు అడ్డు తగలడంతో ప్రభుత్వం తరపున సమాధానం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందింది. ఆ పరిస్థితిని వివరిస్తూ మన్‌మోహన్‌సింగ్ మరుసటి సంవత్సరం (2025 మార్చి 10న) లోక్‌సభలో క్లారిటీ ఇచ్చారు.

ఎందుకీ పరిస్థితి తలెత్తింది? :

పార్లమెంటు సంప్రదాయాల ప్రకారం మాత్రమే కాక సాధారణంగానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులందరూ మాట్లాడిన తర్వాత ప్రభుత్వం తరపున లోక్‌సభ (Lok Sabha) నాయకుడిగా ప్రధాని సమాధానం ఇవ్వడం ఆనవాయితీ. ఈసారి కూడా అలాంటి జరగాల్సింది. కానీ ఆర్మీ మాజీ జనరల్ ఎంఎం నరవాణే బయోగ్రఫీలో (ఇంకా పుస్తకరూపంలో ప్రచురితం కాలేదు) భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందనే అంశాన్ని భారత్-చైనా ఘర్షణ అనే టాపిక్‌గా వివరించారు. దీనిపై లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడేందుకు ఆటంకాలు ఎదురయ్యాయి. నాలుగు రోజులుగా సభ తరచూ వాయిదా పడుతూ ఉన్నది. రాహుల్‌గాంధీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. ప్రధాని మోడీ సభకు వచ్చి సమాధానం చెప్పాల్సిందిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ పీఎం మోదీ ప్రసంగానికి లోక్‌సభ స్పీకర్ షెడ్యూలు ప్రకటించినా విపక్ష సభ్యుల నిరసనలతో కార్యరూపం దాల్చలేదు. చివరకు పీఎం ప్రసంగం, వివరణ, సమాధానం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకరే చదివి వినిపించి మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు ప్రకటించారు.

ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్ :

దేశ రక్షణ, భద్రతకు సంబంధించిన కీలక అంశంపై ప్రధాన ప్రతిపక్ష సభ్యుడిగా రాహుల్‌గాంధీకి గొంతెత్తే అవకాశాన్ని స్పీకర్ ఇవ్వలేదని, అధికార పార్టీ సభ్యులు అడ్డు తగిలారన్నది విపక్ష ఎంపీల ఆరోపణ. భారత్-చైనా మధ్య సరిహద్దు ఘర్షణ 2020లో జరిగిన అంశాలను ఆర్మీ రిటైర్డ్ జనరల్ నరవాణే ప్రస్తావించారని, ఇది పబ్లిక్ డొమెయిన్‌లో ఉన్న అంశమేనని, సభలో చర్చించడానికి అధికార పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేంటని విపక్ష సభ్యులు నాలుగు రోజులుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా అధికార పార్టీ ఎంపీలు అడ్డుపడుతున్నారని, చివరకు ఎనిమిది మంది విపక్ష సభ్యుల్ని ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారని అపోజిషన్ ఎంపీలు ఆరోపించారు. ప్రభుత్వం వివరణ ఇవ్వకపోగా ప్రధాన ప్రతిపక్ష నేతకు మాట్లాడేందుకు అవకాశాన్ని కూడా కాలరాసిందని, ప్రజాస్వామ్యానికి దేవాలయంగా చెప్పుకునే పార్లమెంటులో ఇది జరగడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నది విపక్షాల వాదన. ప్రధాని వివరణ లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందినట్లు లోక్‌సభ స్పీకర్ ప్రకటించడం ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డే అని విపక్షాలు ఆరోపించాయి.

Read Also: బీజాపూర్ అడ‌వుల్లో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌..!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>