epaper
Wednesday, February 18, 2026
epaper

‘నరవణే వర్సెస్​ నెహ్రూ–గాంధీ​​’.. పార్లమెంట్​లో రచ్చ రచ్చ​

కలం, వెబ్​డెస్క్​: బడ్జెట్​ సమావేశాల్లో (Budget Session) ‘రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం’ సందర్భంగా చెలరేగిన మంటలు చల్లారడం లేదు. ఆర్మీ మాజీ చీఫ్​ ఎంఎం నరవణే ఆత్మకథలోని మాటలను సోమవారం లోక్​సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీ ప్రస్తావించడంతో మొదలైన గొడవ బుధవారమూ కొనసాగింది. అధికార, ప్రతిపక్షాల మాటల దాడి, పుస్తకాల ప్రదర్శన, నిరసనలు, పేపర్​ చింపి స్పీకర్​​ కుర్చీ వైపు విసరడం వంటివి గందరగోళం సృష్టించాయి. దీంతో పలుమార్లు వాయిదా పడి, సాయంత్రం 5గంటలకు తిరిగి సమావేశమైనా సభ సజావుగా కొనసాగే పరిస్థితి కనిపించకపోవడంతో గురువారానికి స్పీకర్​ వాయిదా వేశారు.

అంతకుముందు పార్లమెంట్​ ఆవరణలో రాహుల్​ చేసిన కామెంట్లు మరో వివాదాన్ని రేకెత్తించాయి. వెరసి మొన్న, నిన్నటి కంటే ఈరోజు సభ ​లోపల బయట రచ్చ రచ్చ అన్నట్లు సాగింది. ఆఖరికి సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం కూడా రద్దు అయ్యింది. ఆయన రేపు సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

నెహ్రూ–గాంధీ కుటుంబంపై పుస్తకాలు..

ఉదయం సభ ప్రారంభమైన కాసేపటికే రాహుల్​.. నరవణే ఆత్మకథ పుస్తకాన్ని పట్టుకొని మాట్లాడడానికి ప్రయత్నించారు. దీంతో ఆయనకు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్​ ఇవ్వలేదు. దీనిపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రాహుల్​ మాట్లాడనివ్వాలని, సస్పెండ్​ చేసిన ఎంపీలను తిరిగి అనుమతించాలని డిమాండ్​ చేశారు. ఈ క్రమంలో ఎన్​డీఏ, ఇండియా కూటమి సభ్యులు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు.

దీంతో సభ కాసేపు వాయిదా పడింది. అనంతరం తిరిగి సమావేశమయ్యాక బీజేపీ ఎంపీ నిశికాంత్​ దూబే.. నెహ్రూ– గాంధీ కుటుంబంపై వచ్చిన.. ఎడ్వినా అండ్​ నెహ్రూ, ది రెడ్​ శారీ, భోఫోర్స్​ గేట్​, ది యాక్సిడెంటల్​ ప్రైమ్​ మినిస్టర్​ పుస్తకాలను ప్రదర్శించారు. తానూ వాటి గురించి మాట్లాడతానన్నారు. అయితే, ప్యానెల్​ స్పీకర్​ తిరస్కరించారు. రూల్​ నెం.​ 349 ప్రకారం.. సభా​ వ్యవహారాలకు సంబంధంలేని పుస్తకాలు, పేపర్లు, మ్యాగజైన్​లు ప్రదర్శించకూడదని వారించారు (Budget Session).

రవ్​నీత్​పై రాహుల్​ వ్యాఖ్యల దుమారం..

అంతకుముందు పార్లమెంట్​ బయట.. సస్పెండైన విపక్ష ఎంపీలతో కలసి రాహుల్​ ఉండగా, అటువైపు మినిస్టర్​ రవ్​నీత్​ సింగ్​ బిట్టూ వచ్చారు. ఒకప్పుడు కాంగ్రెస్​లో ఉన్న రవ్​నీత్​ గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. ఈ క్రమంలో రవ్​నీత్​ దగ్గరకు రావడం గమనించిన రాహుల్​ ‘మిత్రద్రోహి వచ్చారు’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నిరసన తెలిపిన రవ్​నీత్​ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే, రవ్​నీత్​ మీద రాహుల్​ చేసిన వ్యాఖ్యలు తెలియడంతో ఎన్​డీఏ, బీజేపీ సభ్యులు మండిపడ్డారు. పంజాబ్​కు చెందిన సిక్కు​ నేతలు, సిర్సా సభ్యులు పార్లమెంట్​ బయట ర్యాలీ చేశారు. సిక్కు​ నేతను రాహుల్​ అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. తర్వాత రవ్​నీత్​ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్​ మాటలు ఆగ్రహం కలిగించాయన్నారు. తాను మిత్రద్రోహి అయితే, ఆయన దేశద్రోహి అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

Read Also: నంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని హత్య చేసిన యువతి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>