epaper
Tuesday, November 18, 2025
epaper

ఆత్మరక్షణలో బీఆర్ఎస్… కేడర్ కష్టాలు తప్పవా??

కలం డెస్క్ : జూబ్లీ హిల్స్(Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితంతో బీఆర్ఎస్(BRS) శ్రేణుల్లో నైరాశ్యం నెలకొన్నది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన అపవాదును మూటగట్టుకున్నది. రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ నగరంపై పట్టు సాధించానని కేటీఆర్ గొప్పగా చెప్పుకున్నా ఇప్పుడు ఉప ఎన్నికలో ఓడిపోవడం పార్టీలోనే చర్చనీయాంశమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ హోదాలో కేడర్ ను కాపాడుకోవడం ప్రధాన కర్తవ్యంగా మారింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల నాటికి దిగువ స్థాయిలోని శ్రేణుల్ని కాపాడుకోవడం కీలకంగా మారింది.

పటాపంచలైన భ్రమలు :

పదేండ్ల పాలనను పదేపదే ప్రస్తావిస్తూ ప్రజలు తమవైపే ఉన్నారనే ఆ పార్టీ భ్రమలన్నీ తాజాగా జూబ్లీ హిల్స్ ఫలితంతో పటాపంచలయ్యాయి. సిట్టింగ్ స్థానంలో సానుభూతి కలిసొస్తుందనే అంచనాలూ తారుమారయ్యాయి. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని పార్టీలకంటే ముందుగానే సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. ఉధృతంగా ప్రచారాన్ని నిర్వహించినా ఓటమి తప్పలేదు. సైలెంట్ ఓటింగ్ వర్కవుట్ అవుతుందని, సెంటిమెంట్ పనిచేస్తుందన్న భ్రమలూ తొలగిపోయాయి. తాజా ఓటమితో గ్రేటర్ పరిధిలోని దిగువస్థాయి శ్రేణులు పార్టీతో కొనసాగుతారా.. లేక అధికార కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోతారా.. అనే అనుమానాలు తొంగిచూస్తున్నాయి.

కేడర్‌ను కాపాడుకోవడం కత్తిమీద సాము :

శ్రేణుల్ని నిలబెట్టుకోవడం తక్షణ కర్తవ్యంగా మారింది. పార్టీ రోజురోజుకూ బలహీనపడుతూ ఉన్నదని తాజా పరిణానాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలోనే సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌(Cantonment)ను చేజార్చుకున్న బీఆర్ఎస్ తాజగా జూబ్లీ హిల్స్ స్థానాన్ని సైతం కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీ బలం క్రమంగా పడిపోతూ ఉన్నది. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. రానున్న మూడేండ్ల కాలంలో ఎంత మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొనసాగుతారో.. పక్క చూపులు చూస్తారో.. ఇలాంటి సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

స్థానిక ఎన్నికలు అగ్నిపరీక్ష :

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందోననే చర్చ ఆ పార్టీలో ఇప్పుడే మొదలైంది. ఒక్క అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను ప్రతిష్టాత్మంగా తీసుకున్నా ఆశించిన ఫలితాన్ని పొందలేకపోవడంతో స్థానిక ఎన్నికల్లో ఒకేసారి రాష్ట్రమంతా ఫోకస్ పెట్టడం కత్తిమీద సాము లాంటిదే. స్థానిక కేడర్ సహకారం, దూరమవుతున్న ప్రజల ఆదరణను పొందలేకపోవడం, పార్టీలో అంతర్గత సంక్షోభం.. ఇవన్నీ ఆ పార్టీకి ప్రతిబంధకంగా మారనున్నాయి. దీనికి తోడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీకి దూరం కావడం నైతికంగా ప్రతికూల ప్రభావాన్ని చూపించిందనే చర్చ కూడా నేతల మధ్య జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకోవడం బీఆర్ఎస్‌(BRS)కు అగ్నిపరీక్షగా మారనున్నది.

Read Also: భారీ మెజార్టీలో నవీన్ యాదవ్.. ఎంతంటే..!

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>