ఆంధ్రప్రదేశ్‌లో అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దృష్టిసారించారు. ఆక్రమణలకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించాలని అధికారులను ఆదేశించారు. ఎవరి ఆక్రమణలో ఎంత ఉందన్న వివరాలను స్పష్టంగా తెలపాలన్నారు. ‘అటవీ భూములు ప్రకృతి సంపద.. జాతి ఆస్తి. వాటిని ఆక్రమించిన వారు, చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణలకు పాల్పడిన వారు కచ్చితంగా శిక్షార్హులవుతారు. అటవీ భూముల జోలికి వెళితే అది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని తెలిపారు. అంతేకాకుండా అటవీ భూములను రక్షించే ప్రక్రియను కూటమి ప్రభుత్వం చేపడుతుందన్నారు.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy), ఆయన కుటుంబసభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై పవన్(Pawan Kalyan).. అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన్య ప్రాణి రక్షిత అటవీ భూముల్లోను, అటవీ ప్రాంతాల్లోనూ అటవీ ఆస్తులు కబ్జా చేసి భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించినవాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూములను రక్షించుకొని, రాబోయే తరాలకు అందజేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మనో ధైర్యంతో ముందుకు వెళ్దామని అటవీ అధికారులకు భరోసా ఇచ్చారు.
‘‘పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై మంగళంపేట అటవీ భూముల(Forest Lands) ఆక్రమణల మీద ప్రసారమాధ్యమాల్లో కథనాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం వేగంగా స్పందించింది. విచారణ కోసం విజిలెన్స్ కమిటీ నియమించింది. ఈ కమిటీ రిపోర్టు అత్యంత కీలకం. ఈ నివేదికలో పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబం ఆక్రమించిన భూముల తాలుకా పూర్తి వివరాలను పొందుపరిచారు. దీన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించేవారిని ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రజలకు సంబంధించిన ఆస్తులు, జాతికి సంబంధించిన ఆస్తులపై కన్నేసే వారిపై నిఘా ఉంచుతాం. ప్రకృతి వనరులను దోపిడీ చేసేవారు, ఆక్రమించుకునే వారిపై రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు.
Read Also: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ: చంద్రబాబు
Follow Us on : Pinterest

