epaper
Saturday, January 31, 2026
spot_img
epaper

మున్సి‘పోల్స్’​ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెబల్స్ బెడద

కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నామినేషన్ల ఘట్టం ముగిసింది. బరిలో ఎవరెవరు ఉంటారనేది ఫిబ్రవరి 3వ తేదీన తేలనుంది. ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad ) జిల్లాలో ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలీటీలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు, కామారెడ్డి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు అంటే ఉమ్మడి జిల్లాలో మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతాయి.

నామినేషన్ల తీరు ఇలా..

నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు గానూ 657 మంది అభ్యర్థులు భారీగా 1729 నామినేషన్లు దాఖలు చేశారు. బోధన్ లో 38 వార్డుల్లో 315 మంది 342 నామినేషన్లు, ఆర్మూర్ లో 36 వార్డులుంటే 195 మంది 298 నామినేషన్లు, భీమ్ గల్ లో 12 వార్డులకు గానూ 75 మంది 113 నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ ఆశావహులు తమకే సీటు వస్తుందనే నమ్మకంతో పోటాపోటీగా బీ-ఫామ్​ లేకుండానే నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా వరకూ చూస్తే నిజామాబాద్ కార్పొరేషన్ మూడు మున్సిపాలిటీల్లో కలిపి 146 వార్డులకు గానూ 1729 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 92 వార్డులకు మొత్తం 731 మంది అభ్యర్థులు 1,001 నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డిలో 49 వార్డులలో 360 మంది అభ్యర్ధులు 523 నామినేషన్లు, ఎల్లారెడ్డిలో 12 వార్డులకు అత్యల్పంగా 71 మంది 88 సమర్పించారు. బాన్సువాడలో 19 వార్డులకు 160 మంది 250 నామినేషన్లు, బిచ్కుందలో 12 వార్డులకు గానూ 140 మంది ఒక్కొక్కటి చొప్పున దాఖలు చేశారు. మొత్తం 103 మంది స్వతంత్రులుగా నామినేషన్ సమర్పించారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కంటే.. కొత్తగా ఏర్పడిన బిచ్కుందలోనే అధికంగా అభ్యర్థులు నామినేషన్ వేశారు.

నిజామాబాద్ మేయర్ రేసులో ముగ్గురు

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ ల నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో బీజేపీ నుంచి రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి పేరు అంతర్గతంగా ప్రకటించేశారు. ఆమె ఆరో డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. స్రవంతి రెడ్డి నామినేషన్ ర్యాలీలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. దీంతో బీజేపీ ఎంత క్లారిటీ గా ఉందో అర్థమవుతోంది. ఇక కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడలేదు. మేయర్ పీఠమే లక్ష్యంగా 19వ డివిజన్ నుంచి నల్ల స్రవంతి రెడ్డి, కాటిపల్లి శమంత రెడ్డి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసారు. వీరిద్దరిలో ఎవరికి బీఫారం వస్తే వారే కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కానున్నారు. మేయర్ పదవి ఆశిస్తున్న ఇద్దరూ ఒకే డివిజన్ నుంచి నామినేషన్లు దాఖలు చేయడం ఇక్కడ మరో చెప్పుకోదగ్గ విషయం. అయితే ఉత్కంఠ వీడాలంటే నామినేషన్ల ఉపసంహరణ రోజు వరకు వేచి చూడాల్సిందే.

రెబల్స్ మంతనాలు.. ఎమ్మెల్యేల బుజ్జగింపులు ముమ్మరం

ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లా వ్యాప్తంగా అంతటా రెబెల్స్ బెడద మామూలుగా లేదు. నిజామాబాద్ నగరంలోని 60 డివిజన్ లలో అన్నింటా రెబల్స్ బెడద ఉంది. ప్రతి డివిజన్ లో పార్టీల భారీగా సగటున 2 నుంచి 10 మంది వరకూ పార్టీల తరపున ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు నాయకులు కొందరు రెబల్స్ నామినేషన్ వేయకుండా ఆపగలిగారు. మిగతా వారితో మంతనాలు బుజ్జగింపులు చేస్తున్నారు. నామినేషన్ ఉపసంహరణకు మూడో తేదీ వరకూ సమయం ఉండటంతో ఈ రెండురోజుల్లో రెబెల్స్ డ్రాప్ అయ్యేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ లో పోటీ ఎక్కువగా కనిపిస్తోంది.. మేయర్ ఆశావహులు తక్కువగానే ఉన్నా.. కార్పొరేటర్ రేస్ లో ఎక్కువ మంది ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ నేతల ఆలోచనలు ఒకలా ఉంటే ఆశావహులు సీనియర్ నేతల ఆలోచన మరోలా కనిపిస్తోంది. టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా అయినా బరిలో నిలిచేందుకు చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు. గెలిచాక పార్టీలోకి మళ్ళీ వెళ్లొచ్చనే వ్యూహం చేస్తున్నారు. ఒకే డివిజన్ వార్డు నుంచి బలమైన నేతలు నామినేషన్లు వేసిన చోట పార్టీలకు అభ్యర్థిత్వం ఖరారు చేయడం తలనొప్పిగా తయారైంది.

Read Also: గ్లోబల్ ఎకనామిక్ పవర్ హబ్ గా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>